
చేతివృత్తుల కళాకారుల నైపుణ్యాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ఇందుకు గానూ.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాల ప్రాంగణాల్లో కళాకారులు తమ కళాకృతులను విక్రయించుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. దీంతోపాటుగా కళాకారుల పనితనాన్ని భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచవ్యాప్తం చేయడంలోనూ ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు.
నైపుణ్యం ఉన్న భారతీయ కళాకారులు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడానికి.. సరైన మార్కెటింగ్ అవకాశాలు లేకపోవడమే కారణమన్న ఆయన, స్వచ్ఛంద సంస్థలు కూడా కళాకారులతో కలిసి పనిచేస్తూ, ఆన్ లైన్ మార్కెటింగ్‌కు సంబంధించి స్వల్పకాల కోర్సులను అందిస్తూ, వారి ఆర్థికోన్నతికి తద్వారా భారతదేశ సాంస్కృతికాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు.
ఈశాన్య భారత పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లోని జవహార్ లాల్ నెహ్రూ స్టేట్ మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఓ ఫేస్‌బుక్ వేదికగా తమ మనోగతాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి, మ్యూజియం సందర్శనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్శనశాల మానవ పరిణామ శాస్త్రానికి సంబంధించి దేశంలో ఉన్న అత్యుత్తమ మ్యూజియాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. మ్యూజియంలోని ‘మౌంటెనీరింగ్ గ్యాలరీ’ గురించి వివరిస్తూ.. యువ పర్వతారోహకులకు ఎంతగానో స్ఫూర్తినందిస్తుందని కొనియాడా
చేనేత, చేతవృత్తి కళాకారులు, చిత్రకారుల కళాకృతులతోపాటుగా రాష్ట్రంలోని 27 గిరిజన తెగలను ప్రతిబింబించేలా సంప్రదాయ గిరిజన వస్త్రధారణలో ఉన్న స్త్రీ, పురుషుల జంటతో కూడిన ఏర్పాటుచేసిన 27 చిత్రాలను సందర్శించడం సరికొత్త అనుభూతిని మిగిల్చిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
సహజమైన ప్రకృతి వనరులతో కూడిన అరుణాచల్ ప్రదేశ్ చేతివృత్తులకు కేంద్రంగా భాసిల్లుతోందని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇక్కటి ఒక్కో తెగ నేటికీ తనకంటూ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయమని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ వచ్చే పర్యాటకులు ఈ మ్యూజియంను తప్పనిసరిగా సందర్శించాలని ఆయన సూచించారు.
మరీ ప్రత్యేకంగా పాఠశాలలు తమ విద్యార్థులకు ఇలాంటి మ్యూజియాలకు తీసుకెళ్లడం ద్వారా వారిలో భారతదేశ భవ్యమైన గతం గురించి, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి చక్కగా వివరించేందుకు వీలుంటుందని ఆయన సూచించారు.
More Stories
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజీలాండ్ తో కలిసి పనిచేస్తాం
థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం