లఖింపూర్ ఘటనలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసలో 9 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రికి చెందిన కారు ఢీకొట్టడం వల్ల నలుగురు రైతులు మరణించారు.
అయితే ఈ కేసులో కేంద్ర మంత్రి మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే అని, సుప్రీంకోర్టు కూడా ఇదే చెబుతోందని, ఎటువంటి ఆధారం లేకుండా ఎవర్నీ అరెస్టు చేయలేమని, ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని సీఎం యోగి తెలిపారు.
లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఎవర్నీ వదిలిపెట్టేదిలేదని సీఎం చెప్పారు. ఎవరికీ అన్యాయం చేయమని, అలాగే ఒత్తిడిలో ఎటువంటి చర్యలు చేపట్టబోమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని తేల్చి చెప్పారు.
చట్టం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తుంటే, ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, అది ఎవరైనా పర్వాలేదని సీఎం యోగి చెప్పారు. ఆశిష్ మిశ్రాను కాపాడటానికి బీజేపీ ప్రభు త్వం ప్రయత్నిస్తుందన్న ఆరోపణలను కొట్టిపారవేస్తూ మిశ్రా కారు నడిపినట్టు సాక్ష్యాలు ఉంటే ఎవరైనా అప్‌లోడ్ చేయవచ్చని, చర్యలు తీసుకొంటా మని సవాల్ చేశారు.
లఖింపూర్ వెళ్తున్న ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్లేమి శుభసందేశకులు కాదని ఎద్దేవా చేశారు. శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఖేరికి వెళ్దామనుకుంటున్నవారే అక్కడ జరిగిన హింసకు కారణమని ఆయన ధ్వజమెత్తారు. విచారణ తర్వాత అన్ని అంశాలు స్పష్టంగా బయటకు వస్తాయని సీఎం చెప్పారు.
అస్వస్థతకు గురవ్వడం వల్లే తన కొడుకు శుక్రవారం పోలీసుల విచారణకు హాజరుకాలేదని అజయ్ మిశ్రా పేర్కొన్నారు. తన కుమారుడు అమాయకుడు అని పేర్కొంటూ ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు.
తన కుమారుడు నేపాల్ కు పారిపోయినట్లు వచ్చిన కధనాన్ని ప్రస్తావిస్తూ ఆశిష్ మిశ్రా ఎక్కడికీ పారిపోలేదని, దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తాడని స్పష్టం చేశారు. ప్రతిపక్షం ప్రతి అంశంపై తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నదని ఆయన ఆరోపిస్తూ దర్యాప్తు మొదలైతే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. నిజమే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్ట్ అసంతృప్తి
కాగా, నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వారిని అరెస్టు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర అసంతృప్తి కలిగించాయని పేర్కొంది. ‘మిగతావారి విషయంలో కూడా ఇలాగే చేస్తారా?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం యూపీ పోలీసులను ప్రశ్నించింది.
కేసులో అనుకున్న స్థాయిలో పురోగతి సాగలేదన్న ధర్మాసనం వ్యాఖ్యలతో యూపీ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే ఏకీభవించారు. ధర్మాసనం ముందుకు మళ్లీ ఈ కేసు విచారణ వచ్చేనాటికి కేసులో పురోగతి లేకపోతే, సీబీఐకి అప్పగించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘సున్నిత పరిస్థితి దృష్ట్యా మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. సీబీఐతో కేసు విచారణ పరిష్కారం కాదు’ అని స్పష్టం చేశారు.
దసరా తర్వాత ఈ కేసు విచారణను కొనసాగిస్తామని పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను సుప్రీం కోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది. మరోవంక, లఖింపూర్ బాధిత రైతు కుటుంబాలను జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శించారని ఓ వార్తాసంస్థ ట్వీట్ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు పోస్ట్ చేయవద్దని సూచించింది.
More Stories
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
చైనా, ఇజ్రాయిల్, మయాన్మార్ ల్లోనే అత్యధికంగా జైళ్లలో జర్నలిస్టులు
కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!