16న జయ సమాధి నుండి శశికళ రాజకీయం!

జైలు నుండి రాగానే తమిళనాడు రాజకీయాలలో తిరిగి చక్రం తిప్పాలని, ఈ సంవత్సరం మొదట్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఇప్పటివరకు దాదాపు మౌనంగా ఉంటూ వచ్చారు. రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను ఆంటోనే ఉన్నా స్పష్టంగా అడుగులు వేయలేదు. 

ఇప్పుడు అన్నాడీఎంకేకు పూర్వవైభవం నినాదంతో, ఈ నెల 16న జయలలిత సమాధివద్ద ఆమెకు నివాళులు అర్పించడంతో తన రాజకీయ యాత్రను తిరిగి ప్రారంభించబోతున్నట్లు ఆమె సంకేతం ఇచ్చారు. ఈనెల 17వ తేదీన పార్టీ  స్వర్ణోత్సవాలు జరుగనున్న తరుణంలో, ఈనెల 16వ తేదీన ఆమె మెరీనాతీరంలో వున్న జయ, ఎంజీఆర్‌ల సమాధులకు నివాళులర్పించనున్నారు.

ఎంజీఆర్‌ మరణానంతరం పార్టీకి జరిగిన నష్టం లాంటిదే ఇప్పుడు మళ్లీ పునరావృతమవుతోందని, అందువల్లే తాను మళ్లీ పార్టీలోకి వచ్చి అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాల నుకుంటున్నానని క్రియాశీల రాజకీయాల పట్ల తన ఆసక్తిని వెల్లడించారు. మళ్లీ అమ్మ పాలనను తీసుకురావాలన్న తన లక్ష్యంలో  ఎలాంటి మార్పు కూడా లేదని, తన మాటకు కట్టుబడి శాయశక్తులా కృషి చేస్తానని శశికళ ప్రకటించారు. 

అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే ముందు చివరిగా జయ సమాధి వద్ద అంజలి ఘటించిన శశికళ.. జైలుశిక్ష ముగించుకుని చెన్నై చేరగానే జయ సమాధి వద్దకు వెళ్లాలని భావించారు. కానీ సమాధి వద్ద మరమ్మతుల పేరుతో నాటి అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రజల సందర్శననే రద్దు చేసింది. దీంతో ఊరుకున్న శశికళ.. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని జయ సమాధి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆమె అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒకప్పటి అన్నా డీఎంకే అధికారపత్రిక ‘నమదు ఎంజీఆర్‌’లో శశికళ పేరుతో ప్రచు రితమైన వ్యాసంలో ఆమె తన రాజకీయ పరమైన అడుగుల గురించి ప్రస్తావించారు. పార్టీ పతనావస్థలోకి వెళ్లిపోతున్నా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోలేనని, పార్టీలోకి ప్రవేశించి, అందరి సహకారంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ఆమె స్పష్టం చేశారు.  తన సంకల్పం ముందు ఎవ్వరూ నిలవలేరని అంటూ తన రాజకీయ ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరిక చేశారు.

అన్నాడీఎంకే నేతలంతా ఈనెల 17న జయ, ఎంజీఆర్‌లకు నివాళులర్పించనుండగా, శశికళ ఒక రోజు ముందుగానే అక్కడికెళ్లనున్నారు. ఆ తరువాత నేరుగా స్థానిక రామాపురం వెళ్లి, దివంగత ఎంజీఆర్‌ గృహంలో ఏర్పాటు చేసిన బధిరుల పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ ఎంజీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆమె ప్రజాప్రస్థానం కోసం ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలుస్తున్నది.

అన్నాడీఎంకేను కాపాడుకోవడమే జయలలిత అభిమాను లు, ఆమె విశ్వాసపాత్రుల ముందున్న ఏకైక లక్ష్యమని ఆ వ్యాసంలో ఆమె తెలిపారు. దిశా నిర్దేశం చేశారు. మిగిలిన వాటి గురించి చింతించాల్సిన పని లేదని, పార్టీని కాపాడుకోవడమే అందరి లక్ష్యం కావాలని ఆమె పిలుపిచ్చారు. విప్లవ నాయకుడు ఎంజీఆర్‌, విప్లవ నాయకి జయలలితలకు నిజమైన విశ్వాసపాత్రులెవ్వరూ పార్టీని వదిలి వెళ్లబోరని కూడా చెప్పారు. 

అలాంటి వారెంతో మంది పార్టీలో ఉండి కుమిలిపోతున్నారని  చెబుతూ అలాంటి కార్యకర్తలు పడు తున్న ఆవేదన ను గమనించానని, ఇకపై అలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోలేనని ఆమె పేర్కొన్నారు. ఎంజీఆర్‌ మరణానంతరం జరిగిన పరిణామాల్లో జయ వెంట తాను నిలబడి పార్టీ అభివృద్ధికి పడ్డానని గుర్తు చేస్తూ.. పార్టీకి పూర్వ వైభవం కల్పించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని  స్పష్టం చేశారు.