హెటిరో డ్రగ్స్‌పై ఐటీ సోదాల్లో రూ వందల కోట్ల నగదు గుర్తింపు!

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మాస్యూటికల్‌ కంపెనీ హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారుల చేపట్టిన సోదాలలో వందల  కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. బహుశా దేశంలో మరే పరిశ్రమలో కూడా ఇంత భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. ఆ మొత్తాన్ని నాలుగు వాహనాలలో కోఠిలోని స్టేట్ బ్యాంకు బ్రాంచ్ కు తరలింపవలసి వచ్చింది. 

నాలుగు రోజులుగా  హెటిరో డ్రగ్స్‌ కార్యాలయాలు, ప్లాంట్లు, ల్యాబ్స్‌, డైరెక్టర్ల ఇళ్లలో జరిగిన జరిపిన సోదాల్లో ఈ నగదును గుర్తించారు.  ‘‘ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఒక కొలిక్కి రాలేదు. లభించిన నగదు, స్థిర చరాస్తులు, డాక్యుమెంట్‌ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు.. ఇలా చాలాఅంశాలపై అసె్‌సమెంట్‌ జరగాల్సిఉంది.” అని  ఐటీ శాఖ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌(సీఐయూ)కు చెందిన ఓ అధికారి చెప్పారు.  

తెలంగాణ, ఏపీ, ముంబై తదితర ప్రాంతాల్లో మొత్తం 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. దాడులు కొనసాగుతున్నాయని  వివరించారు. అన్ని చోట్లా కలిపి భారీగా నగదు పట్టుబడ్డట్లు చెప్పారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక బిలియనీర్ గా మారిన బి. పార్థసారధి రెడ్డి హెటిరో గ్రూప్ ఛైర్మన్.  పార్థసారధి రెడ్డి హైదరాబాదు నుంచి రెండో అతిపెద్ద ధనవంతుడిగా వార్తల్లో నిలిచిన కొన్ని రోజుల తర్వాత ఐటీ సోదాలు జరగడం గమనార్హం. 

తర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమితి చేసింది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులను ఎగుమతి చేసింది. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు ఐటీ గుర్తించింది. చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసినట్లుగా గుర్తించారు. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసింది.

16 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.550 కోట్ల నగదు నిల్వలు లెక్కతేలాల్సి ఉంది. హెటిరోపై రైడ్స్‌ ప్రారంభించేదాకా ఈ సోదాల్లో పాల్గొన్న చాలా మంది ఐటీ సిబ్బందికి విషయం తెలియదని సమాచారం. మంగళవారం ఉదయమే హైదరాబాద్‌లోని ఆయ్‌కార్‌ భవన్‌, విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో సీఐయూ, పలువురు జోనల్‌ ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు కబురు పెట్టినట్లు తెలిసింది.

అలా 300 మంది ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది చేరాక  40 ఎస్‌యూవీల్లో ఎక్కడి వారు అక్కడికి వెళ్లారు. బుధవారం ఉదయం ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే  సనత్‌నగర్‌లోని హెటిరో ప్రధాన కార్యాలయం, చౌటుప్పల్‌, గుండ్లపోచంపల్లి, విశాఖలోని నక్కపల్లి, ముంబై తదితర ప్రాంతాల్లోని హెటిరో ప్లాంట్లు, ప్రాంతీయ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి.

నాలుగు రోజులుగా సిబ్బంది ఈ దాడుల్లో నిమగ్నమయ్యారు. శనివారం కూడా దాడుల్లో కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్లకు పైగా నగదు పట్టుబడ్డ నేపథ్యంలో అధికారులు ఆ మొత్తం ఎక్కడిది? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.  బోరబండలోని ఓ ఫ్లాట్‌ నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

హెటిరో కార్యకలాపాలపై ఐటీశాఖ ఆర్నెల్లుగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో ఈ కంపెనీ తయారుచేసిన రెమిడెసివిర్‌ ఇంజక్షన్లకు డిమాండ్‌ తెలిసిందే. ఆ తర్వాత ఈ కంపెనీ కరోనాకు దివ్యౌషధంగా టోసిలిజుమాబ్‌ను తీసుకువచ్చింది.

కరోనా సోకి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌/వెంటిలేటర్‌ బెడ్‌పై ఉండే సీరియస్‌ రోగులపై స్టెరాయిడ్స్‌ పనిచేయని పరిస్థితుల్లో టోసిలిజుమాబ్‌ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ నిఘా కొనసాగినట్లు సమాచారం. దొరికిన నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపలేక పోవడంతో అధికారుల్లో స్వాధీనం చేసుకోవలసి వచ్చిన్నట్లు చెబుతున్నారు.