మాకు మియా ఓట్లు వద్దే వద్దు. మేం సామరస్యంగా జీవిస్తున్నాం

 ‘మాకు మియా ఓట్లు వద్దే వద్దు. మేం సామరస్యంగా జీవిస్తున్నాం. ఓట్ల కోసం నేను వారి వద్దకు వెళ్లను. అలాగే వారు కూడా నా వద్దకు రారు’ అని   అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ  స్పష్టం చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్-2021 లో మాట్లాడుతూ బెంగాలీ మూలం నుంచి అసోంకు వచ్చిన ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని శర్మ చెప్పారు. 

వీరిని స్థానికంగా ‘మియా’ ముస్లింలు అని పిలుస్తారు. అసోం గుర్తింపు, సంస్కృతి, భూమిని కోల్పోవడానికి రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు వలస వచ్చిన ముస్లింలే కారణమని నమ్ముతారని హిమంత చెప్పారు. తమ  రాష్ట్రంలో సమాజ ఆధారిత రాజకీయాలు లేవని ఆయన తెలిపారు.

ముస్లిం వలసదారులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున ఆక్రమణలు తీవ్రంగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పక్రియ స్వతంత్రం ముందు నుండే సాగుతున్నదని చెప్పారు. భూఆక్రమణలను తొలగిస్తున్న సందర్భంగా ఇటీవల ఘర్షణలు చెలరేగడం గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రంలో 77,000 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని, కేవలం ఒక వేయి కుటుంబాల ఆక్రమణలో అంత పెద్ద భూభాగం ఉండడం తగదని స్పష్టం చేశారు.

ఒక కుటుంభం రెండు ఎకరాలకు ముంచి భూమి ఆక్రమించరాదన్నది తమ ప్రభుత్వ విధానమని చెబుతూ, భూమి ఇవ్వవలసిన ప్రజలు చాలామంది ఉన్నారని తెలిపారు. ఆక్రమణల తొలగింపు కొనసాగే పక్రియ అని చెబుతూ, ఇందులో మత ప్రాతిపదిక అంటూ ఏమీ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్థానిక అస్సామీ ప్రజల ఆక్రమణలను కూడా తొలగిస్తున్నామని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నదని చెబుతూ మాదకద్రవ్యాల రికవరీ రోజుకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటున్నదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతి 100 రోజుల్లో తమ ప్రభుత్వం  2,000 మంది స్మగ్లర్లను, 500 మంది ల్యాండ్‌ బ్రోకర్లను అరెస్టు చేసిందని శర్మ వెల్లడించారు.

భూమి రికార్డులను డిజిటలైజ్ చేసి, గిరిజన ప్రజలతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. అస్సాం అభివృద్ధి పథంలో ఉన్నదని, రానున్న ఐదేండ్ల కాలంలో దేశంలోని అగ్ర రాష్ట్రాలలో అసోం ఒకటిగా నిలువడం ఖాయమని హిమంత బిశ్వ శర్మ భరోసా వ్యక్తం చేశారు.

కాగా, చీపురు చేత పట్టినంత మాత్రానా సామాన్య ప్రజల్ని ఆకట్టుకోలేం అని సీతాపూర్‌లోని గెస్ట్‌హౌజ్‌లో చీపురుపట్టి శుభ్రం చేసిన ప్రియాంక వాద్రా వీడియోపై హిమంత ఎద్దేవా చేశారు. ‘నా తల్లి ఇంట్లో చీపురుతో శుభ్రం చేస్తుంది. ఇదేమీ పెద్ద విషయం కాదు. అందరు మహిళల మాదిరిగానే ప్రియాంక వాద్రా కూడా తన గదిని శుభ్రం చేసుకున్నారు. ఇలాంటి వీడియోలు ప్రదర్శించి మహిళల్ని డీఫేం చేయడం తగదు’ అని హిమంత బిశ్వ శర్మ హితవు చెప్పారు.