పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం

పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం

ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తున్నదని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ఈ ప్రాంతం ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నదని చెప్పారు. 

ఏడేండ్లుగా ఈశాన్య భారతంలో వస్తున్న మార్పులు ఈ ప్రాంతం భవిష్యత్‌లో సాధించే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చట్టసభల పనితీరును పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించేలా చట్టసభలు ఉండాలని సూచించారు. 

2015-20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా 6 రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ధోరణి ఆందోళనకరమని తెలిపారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. 

మొత్తం 498 మంది శాసనసభ్యుల్లో 4 శాతం మాత్రమే మహిళలుండటం సరికాదని చెబుతూ చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని సూచించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.

మానవాభివృద్ధి సూచీ-2019 ప్రకారం, ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు జాతీయ సగటుకంటే మంచి స్థానంలో నిలిచిందని వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నెలకొల్పిన గ్రంథాలయాన్ని, డోర్జీ ఖండూ సమావేశ ప్రాంగణాన్ని ఉపరాష్ట్రపతి జాతికి అంకింత చేశారు.

అనంతరం ప్రాంగణంలో కాగితం రీసైక్లింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ ప్రసాంగ్ దోర్, ముఖ్యమంత్రి పెమా ఖండూ పాల్గొన్నారు.