ఆప్ఘనిస్థాన్‌లో తయారైన ఉగ్రవాదులు ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత కశ్మీరులో చొరబడే ప్రయత్నం చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవనే తెలిపారు. అయితే ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారతీయ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కశ్మీరులో ఇటీవల సాధారణ ప్రజలపై జరుగుతున్న ఉగ్రవాద దాడులకు, ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి మధ్య సంబంధం ఉందా? అని అడిగినపుడు ఈ సంబంధం గురించి చెప్పలేమని పేర్కొన్నారు.
కచ్చితంగా జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని, అయితే వాటికి ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన లేదా జరుగుతున్నదానితో ప్రత్యక్ష సంబంధం ఉందా? అనే అంశాన్ని మనం చెప్పలేమని తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం తాలిబన్లు పరిపాలించినపుడు ఆఫ్ఘనిస్థాన్‌లో తయారైన ఉగ్రవాదులు జమ్మూ-కశ్మీరుకు వచ్చారని గుర్తు చేశారు.
ఇది పునరావృతమవుతుందని అనుకోవడానికి తగిన కారణాలు ఉన్నాయని తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఆ దేశం నుంచి ఉగ్రవాదులు కశ్మీరుకు రావచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి భారతీయ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. విదేశీ ఉగ్రవాదులను నిరోధించేందుకు సరిహద్దుల్లో పటిష్టమైన కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ ఉందని పేర్కొన్నారు.
వాస్తవాధీన రేఖ వెంబటి చైనా సేనలు మౌలిక సదుపాయాలను సమకూర్చుకొంటూ, మోహరిస్తున్నాయని చెబుతూ ఇది భారత్ కు ఆందోళన కలిగించే అంశమే అని నరవాణ చెప్పారు. చైనా ఈ ధోరణి కొనసాగిస్తే భారత్ సేనలు కూడా మోహరిస్తాయని స్పష్టం చేశారు

More Stories
సిఎఎ పరిధిలోకి రాని ప్రతి ఒక్కరూ చొరబాటుదారులే
రాయల్ సొసైటీ ఫెల్లోగా డాక్టర్ సౌమ్య స్వామినాథన్
పంజాబీ గాయని ఇందర్ కౌర్ దారుణ హత్య