ఆఫ్ఘన్ మసీద్ పై దాడిలో 100 మంది మృతి !

ఆప్ఘ‌నిస్ధాన్‌లోని మ‌సీదుపై జరిగిన ఉగ్రదాడి ఘ‌ట‌న‌లో కనీసం 100 మంది మృతి చెందడం, గాయపడటం జరిగిన్నట్లు తెలుస్తున్నది.  కుందుజ్‌లోని మ‌సీదుపై శుక్ర‌వారం ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో పలువురు గాయ‌ప‌డ్డారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో వంద‌ల మంది ముస్లింలు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌తో కుందుజ్ సెంట్ర‌ల్ ఆస్ప‌త్రి కిక్కిరిసిపోయింది.

ఈ ఘ‌ట‌న‌లో త‌మ ఆస్ప‌త్రికి ఇప్ప‌టికి 35 మృత‌దేహాలు తీసుకువ‌చ్చార‌ని, 50 మంది గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇక ఇత‌ర ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతులు, క్ష‌త‌గాత్రుల బంధువుల రోద‌న‌ల‌తో కుందుజ్ ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. 

ఇప్పటి వరకు ఈ దాడికి ఎవ్వరు బాధ్యులమని ప్రకటించాక పోయినా ఉత్తర ఆఫ్ఘానిస్తాన్ లో షియా ముస్లింల మసీద్ లపై ఐఎస్ ఉగ్రవాదులు తరచూ దాడిచేస్తున్నారు. గత ఆగష్టు లో తాలిబన్ల నియంత్రణకు వచ్చిన తర్వాత ఉగ్రదాడిలో అత్యధికులు మృతి చెందిన సంఘటన ఇదే అని చెప్పవచ్చు. 

కుందుజ్ మ‌సీదులో పేలుడు ఘ‌ట‌న‌లో చాలామంది మ‌ర‌ణించగా, పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌కు గాయాల‌య్యాయ‌ని తాలిబ‌న్ ప్ర‌తినిధి జ‌బిహుల్లా ముజ‌హిద్ తెలిపారు. తాలిబన్ దళాలు అక్కడకు చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు.  తాలిబన్ ఉన్నతాధికారి ఒకరు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, మసీదులో శుక్రవారం ప్రార్ధనలు జరుగుతూ ఉండగా  లక్ష్యంగా బాంబు పేలుడు జరిగింది.

ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై మంగళవారం తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువులు, పరికరాలను ధ్వంసం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు.