రష్యా, ఫిలిప్పైన్స్ జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి

నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరు పాత్రికేయులకు లభించింది. ఫిలిప్పైన్స్‌కు చెందిన మారియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మురటోవ్‌ ఈ పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు.  ప్ర‌జాస్వామ్యానికి, సుదీర్ఘ శాంతి స్థాప‌నకు కీల‌క‌మైన భావ స్వేచ్ఛను ప‌రిర‌క్షిస్తున్న ఈ ఇద్ద‌రికీ ఈయేటి నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని అందిస్తున్న‌ట్లు  నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌పర్సన్ బెరిట్ రెయిస్స్-ఆండర్సన్ శుక్రవారం ప్రకటించారు. 
పిలిప్పీన్స్‌లో మారియా రెస్సా, ర‌ష్యాలో దిమిత్రి ముర‌టోవ్‌లు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కోసం అసాధార‌ణ‌మైన పోరాటాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది. మారియా, ముర‌టోవ్‌లు ఇద్ద‌రూ జ‌ర్న‌లిస్టులు అని, ప్ర‌జాస్వామ్యం-ప‌త్రికా స్వేచ్ఛ కోసం వాళ్లు చేస్తున్న పోరాటం స్పూర్తిదాయ‌క‌మ‌ని క‌మిటీ పేర్కొన్న‌ది.

పిలిప్పీన్స్‌లో అధికార దుర్వినియోగంపై మారియా త‌న గ‌ళం విప్పారు. భావ స్వేచ్ఛ‌తో ఆ దేశంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను ఆమె బ‌య‌ట‌పెట్టారు. పెట్రేగిపోతున్న హింస‌, అధికార దుర‌హంకారాన్ని ఆమె ప్ర‌శ్నించారు. 2012లో ఆమె రాప్ల‌ర్ డాట్‌కామ్‌ను స్థాపించారు.

పరిశోధనాత్మక జ‌ర్న‌లిజం కోసం డిజిటల్ మీడియా కంపెనీని ఆమె ప్రారంభించారు. జ‌ర్న‌లిస్టుగా, సీఈవోగా ఆమె నిర్భ‌యంగా భావ స్వేచ్ఛ‌ను వాడుకున్నారు. అధ్య‌క్షుడు డ్యుటెర్టో చేస్తున్న అరాచ‌కాల‌పై ఆమె దృష్టి పెట్టారు. వివాదాస్ప‌ద పాల‌న‌, హ‌ద్దు లేని హత్యలు, యాంటీ డ్ర‌గ్ క్యాంపేన్ పేరుతో సాగిన దుశ్చ‌ర్య‌ల‌ను ఆమె నిల‌దీశారు.

ర‌ష్యాలో కొన్ని ద‌శాబ్ధాలుగా భావ స్వేచ్ఛ కోసం ముర‌టోవ్ పోరాటం చేశారు. రోజురోజుకూ స‌వాల్‌గా మారుతున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న మేటి జ‌ర్న‌లిస్టు పాత్ర‌ను పోషించారు. 1993లో నోవాజా గెజిటా అనే ప‌త్రిక‌ను స్థాపించారు. స‌త్యాన్ని రాయ‌డం, ప్రొఫెష‌న‌ల్‌గా వార్త‌ల‌ను అందించ‌డంలో నోవాజా గెజిటాకు మంచి గుర్తింపు వ‌చ్చింది.

ర‌ష్యాలో మ‌రే మీడియా చేయ‌లేని ప‌ని ముర‌టోవ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప‌త్రిక‌కు చెందిన ఆరుగురు జ‌ర్న‌లిస్టులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఎన్ని బెదిరింపులు వ‌చ్చినా.. ఎడిట‌ర్ దిమిత్రి ప‌త్రిక‌ను ధైర్యంగా న‌డిపారు. జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల కోసం నిరంత‌రం శ్ర‌మించారు. భావ స్వేచ్ఛ‌, స‌మాచార స్వేచ్ఛ కీల‌క‌మైన‌వి భావిస్తున్న‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో అభిప్రాయ‌ప‌డింది.

ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు క్రింద విజేతలకు ఓ బంగారు పతకం, సుమారు 1.14 మిలియన్ డాలర్లు లభిస్తాయి. స్వీడిష్ ఇన్వెంటర్ ఆల్ఫెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా ఈ బహుమతులను ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది.