వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి

ఈశాన్య రాష్ట్రాల వంటి వెనుకబడిన ప్రాంతాల పురోగతి, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వ్యవసాయరంగాన్ని సాంకేతికతతో అనుసంధానం చేసి, ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. గిరిజిన సంస్కృతులకు అనుగుణంగా స్థిరమైన, నిర్దుష్ట సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. 

గత నాలుగు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న వెంకయ్య.. గురువారం నాడు నాగాలాండ్‌ దిమాపూర్‌లోని ఐసీఏఆర్‌ జాతీయ పరిశోధనా విభాగాన్ని సందర్శించారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్న ‘మిథున్’ సంస్థను అభినందించారు. నాగాలాండ్ ప్రజల సంస్కృతిలో ఆర్థికంగా, సామాజికంగా పశుసంపదకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదని ఆయన  చెప్పారు.

విద్యావంతులైన యువత పశుసంపద సంరక్షణ మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.భారతీయ గ్రామీణ ప్రాంతాల కుటుంబ ఆదాయంలో మూడింట ఒకవంతు పాడిపరిశ్రమదే అని తెలిపారు. ఐసీఏఆర్‌ పరిశోధనా కేంద్రంలో పశుసంపద ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధి విషయంలో జరుగుతున్న పనుల పట్ల వెంకయ్యనాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.

సేంద్రీయ వ్యవసాయం మీద ఈశాన్య భారతం దృష్టి కేంద్రీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వెంకయ్య వెంట నాగాలాండ్, అసోం గవర్నర్ జగదీష్ ముఖి, నాగాలాండ్ ఉపముఖ్యమంత్రి వై పత్తన్, వ్యవసాయ శాఖ మంత్రి కైతో అయి, మిథున్‌లోని ఐసీఏఆర్‌-ఎన్ఆర్‌సీ సంచాలకుడు డాక్టర్ మీరజ్ హైదర్ ఖాన్‌తోపాటు పలువురు శాస్త్రవేత్తలు ఉన్నారు.