త్వ‌ర‌లో వంద కోట్ల వ్యాక్సిన్ మార్క్ దాటేస్తాం

త్వ‌ర‌లోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ మైలురాయిని చేరుకోనున్న‌ట్లు ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు.  ఉత్తరాఖండ్‌లోని హృషీకేశ్‌లో ఉన్న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో గురువారం జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఆయ‌న జాతికి అంకితం చేశారు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ప్రారంభించారు.

 పీఎం కేర్స్ నిధి క్రింద కొత్తగా 4,000 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని తెలిపారు. కరోనా ఫ్లాట్‌ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టి ప్ర‌పంచానికి భార‌త్ ఓ మార్గాన్ని చూపించింద‌ని ప్రధాని తెలిపారు.

అతి త‌క్కువ స‌మ‌యంలోనే వైద్య స‌దుపాయాలు క‌ల్పించి భార‌త్ త‌న సామ‌ర్థ్యాన్ని చాటింద‌ని పేర్కొన్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని, మాస్క్‌ల‌ను దిగుమ‌తి చేసేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. అన్ని రంగాల్లో ఎగుమ‌తి చేసే దిశ‌గా భార‌త్ దూసుకువెళ్లుంద‌ని ప్ర‌ధాని చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా 92 కోట్ల మందికి కరోనా టీకాలు  ఇచ్చామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సూక్ మాండ‌వీయ ఈ సందర్భంగా  తెలిపారు. ఇక ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో 95 శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

దేశంలోని అన్ని జిల్లాల్లోనూ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పీఎం కేర్స్ నిధి  క్రింద 1,224 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయని పేర్కొంది. వీటిలో 1,100 ప్లాంట్లు ప్రారంభమయ్యాయని, రోజుకు 1,750 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను అందజేస్తున్నాయని తెలిపింది.