‘గాడ్సే’ సినిమా టీజర్‌ విడుదల

‘గాడ్సే’ సినిమా టీజర్‌ విడుదల

మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ‘గాడ్సే’ సినిమా ప్రకటన వెలువడింది. ఈ ప్రత్యేకమైన రోజున ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ ప్రకటించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. 

గాంధీ జయంతి సందర్భంగా ‘గాడ్సే’ సినిమా టీజర్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ ద్వారా మహేష్ మంజ్రేకర్ పంచుకుని సినిమా పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్సే’ సినిమాకు సందీప్ సింగ్, రాజ్‌ శాండిల్యా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమ రాబోయే చిత్రం ‘గాడ్సే’ కోసం మహేష్ మంజ్రేకర్ మరియు రాజ్ శాండిల్యాతో చేతులు కలుపుతున్నట్లు సందీప్‌ సింగ్‌ ప్రకటించారు.

ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మాణ సంస్థ లెజెండ్ గ్లోబల్ స్టూడియో, రాజ్ శాండిల్య నిర్మాణ సంస్థ థింక్‌ఇంక్ పిక్చరెజ్ నిర్మిస్తున్నాయి. లెజెండ్ గ్లోబల్ స్టూడియో కోసం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. దీని కన్నా ముందు ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ , ‘వైట్’ సినిమాలకు పనిచేశాడు. ‘నాథూరామ్ గాడ్సే కథ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ తరహా సినిమా ప్రాజెక్ట్‌కు దర్శకత్వం చేయడానికి చాలా ధైర్యం కావాలి. నేను ఎప్పుడూ కష్టపడే సబ్జెక్ట్‌లు, రాజీపడని కథా కథనాలను నమ్ముకుంటాను’ అని తెలిపాడు. 

గాంధీపై గాడ్సే కాల్పులు జరిపిన వ్యక్తిగా మినహాయిస్తే, ఆయన గురించి ప్రజలకు పెద్దగా ఏమీ తెలియదు. అతడి కథను చెప్తున్నప్పుడు ఆయనను ఒక పాత్రగానే చూస్తాం కానీ, ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం. ఎవరు సరైనవారు, ఎవరు కాదు అనేది ప్రేక్షకులకే వదిలివేస్తామని మహేష్‌ మంజ్రేకర్‌ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు.

గత  కొన్నేళ్లుగా దేశంలో గోడ్సే గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతున్నదని రాజ్‌ శాండిల్యా తెలిపారు. “మనం భావ ప్రకటనా స్వేచ్ఛ, విభిన్న అభిప్రాయాలను ప్రోత్సహించే సమయాల్లో జీవిస్తున్నాం. కాబట్టి, నాథూరామ్ గాడ్సేపై సినిమా తీయడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాము” అని చెప్పారు.