బ్రిటన్‌ పౌరులకు విధిగా పది రోజులు క్వారంటైన్‌

భారత్‌కు వచ్చే బ్రిటన్‌ పౌరులు టీకా వేయించుకున్నప్పటికీ విధిగా పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. ‘అక్టోబర్ 4 నుండి భారతదేశానికి వచ్చే బ్రిటన్‌ జాతీయులంతా, వారి టీకా స్థితితో సంబంధం లేకుండా, మూడు కోవిడ్‌ 19 ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది’ అని ప్రకటించింది.

ప్రయాణానికి 72 గంటల ముందు, విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, భారత్‌కు వచ్చిన 8వ రోజు తర్వాత కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే భారతదేశానికి చేరిన తర్వాత ఇంట్లో లేదా గమ్యస్థాన చిరునామాలో తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. 

బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఇటీవల భారతీయ ప్రయాణికుల పట్ల ఇలాంటి ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్‌ టీకా గుర్తింపు, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై భారత్‌ సీరియస్‌ అయ్యింది. దీంతో కోవిషీల్డ్‌ను అనుమతించిన వ్యాక్సిన్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపింది. 

అయితే భారతీయ టీకా సర్టిఫికేట్‌ను గుర్తించబోమని చెప్పింది. కాగా, దీనిపై ప్రతి చర్యలు తీసుకుంటామని భారత్‌ అప్పుడే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు వారి టీకా స్థితితో సంబంధం లేకుండా విధిగా పది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌ తాజా నిర్ణయంపై బ్రిటన్‌ స్పందించింది. భారత ప్రయాణికులకు నిబంధనలను సరళతరం చేస్తామని పేర్కొన్నది.