2018 ఎన్నికల డబుల్ బెడ్ రూమ్‌ హామీని ఏమైంది?

2018 ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్‌ హామీని ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కు వ్రాసిన బహిరంగ  లేఖలో సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ. 5 నుంచి 6 లక్షల ఆర్థికసాయం మాట ఏమైందని ప్రశ్నిచారు. 
 
ఇప్పటివరకు ఒక్కరైనా లబ్ధిదారులు ఉన్నారా..? అని అడిగారు. అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని నిలదీశారు. అందులో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 నాటి ఎన్నికల హామీ గురించి చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను సవాల్ చేశారు. 
కేంద్ర ప్రభుత్వం 2లక్షల 91వేల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసిందన్న సంజయ్ వాటిల్లో ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారని అడుగుతూ,  మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని పూర్తిచేశారని బండి సంజయ్‌ నిలదీశారు.
 
 2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ 14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు” అని సంజయ్ గుర్తు చేశారు. 
 
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మొత్తం ఎన్నిదరఖాస్తులు వచ్చాయి? అందులో అర్హత ఉన్నవి ఎన్ని? వాటి వివరాలు ఇవ్వగలరా? అంటూ సంజయ్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంక్రిందగ్రామీణ, పట్టణాలలోఇండ్లు పొందడానికి అర్హత ఉన్న లబ్ధిదారులు జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వానికిసమర్పించడంలేదు? ఇందులో ఏమైనా మతలబుఉందా? అంటూ నిలదీశారు.
కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన 2.91 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తిచేస్తే… తెలంగాణలో పేదల కోసం మరో 10 లక్షల ఇండ్లు కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యత బిజెపి తెలంగాణ శాఖది అని సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2.91 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామని మీరు హామీ ఇవ్వగలరా? అని కేసీఆర్ ను అడిగారు. 
 
వందల కోట్ల రూపాయలతో మీరు ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్ ను సంవత్సర కాలంలోనే నిర్మించుకున్నారు. మీరు 2014లో నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే 26.31 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారు. 7 ఏళ్లు పూర్తవుతున్నా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారు? పేదల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా? అంటూ ఎద్దేవా చేశారు.