హుస్నాబాద్‌లో సంజయ్ పాదయాత్ర ముగింపు రేపే!

హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ఉపఎన్నిక షెడ్యూల్‌ వెలువడడటంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలని బిజెపి నిర్ణయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 2న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ముందుగా హుజూరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలనుకున్నా  షెడ్యూల్ వెలువడటంతో, బహిరంగ సభల పట్ల ఎన్నికల కమీషన్ కఠిన నిబంధనలు విధించడంతో హుస్నాబాద్ కు మార్చారు. హుజురాబాద్ లో జరిపే బహిరంగ సభకు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా రావలసి ఉంది.
ఏడేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తుది దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా,  గాంధీ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి బండి సంజయ్‌ హుస్నాబాద్‌లోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించనున్నారు.
అక్కడి నుంచి ప్రచార రథంలో పట్టణంలో రోడ్‌షో నిర్వహిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజానీకానికి ధన్యవాధాలు చెబుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభలో సంజయ్ ప్రసంగిస్తారు. హుస్నాబాద్‌లో నిర్వహించనున్న సభను విజయవంతం చేసి తమ సత్తా చాటాలని బిజెపి ప్రణాళిక రచిస్తోంది.

తొలిదశ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించడం, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బిజెపి బ్రహ్మరథం పడుతూనే టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతుండటంతో రాష్ట్ర ప్రజల పక్షాన భవిష్యత్తులో తీవ్రస్థాయిలో పోరాటాలు చేసే అంశంపై బహిరంగ సభా వేదికగా వివరించనున్నారు. 

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వివిధ జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జిలతో బండి సంజయ్ కుమార్ సిద్ధిపేట జిల్లా కోహెడ్‌లోని పాదయాత్ర శిబిరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధిపేట జిల్లాకు 120 కి.మీల పరిధిలోని పొరుగు జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.