అమిత్ షాతో అమరిందర్‌ భేటీతో కాంగ్రెస్ కలవరం

పంజాబ్  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఒక వారం రోజుల అనంతరం కెప్టెన్ అమరిందర్ సింగ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను ఢిల్లీలో కలవడం కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నది. రైతు ఆందోళన పరిష్కారం కోసమే కలసిన్నట్లు చెబుతున్నా పలు రాజకీయ ఊహాగానాల మధ్య ఈ భేటీ  కాంగ్రెస్ లో ఆందోళన కలిగిస్తున్నది. 
 
ఒక  వంక పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోతి సింగ్ సిద్దు రాజీనామా చేయడంతో పార్టీలో అనిశ్చిత నెలకొంది. అమరిందర్ సింగ్ కేవలం వ్యక్తిగత పనులపై ఢిల్లీ వచ్చారని, తన అధికార నివాసం ఖాళీ చేయడంకోసం వచ్చారని చెబుతున్నా పార్టీ అధినేతలు ఎవ్వరిని కలవక పోవడం, అమిత్ షా తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 
 
కేంద్ర కొత్త సాగు చట్టాలు, వాటి రద్దుకై 10 నెలలకు పైగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై షాతో చర్చించానని అమరిందర్‌ తెలిపారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేసి వెంటనే సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరానని చెప్పారు. ఈ విషయంలో ఒక బ్లూప్రింట్‌ తయారుచేయాలని ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే,  అమరీందర్‌ బీజేపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో షాతో భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కొన్నినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముసలం అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నది.
వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన ఏర్పడడంతో కెప్టెన్ అమరిందర్ సింగ్ మధ్యవర్తిగా ఇరువురి మధ్య చర్చలు జరుపుతారా? అనే  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేయవలసిందే అని అమరిందర్ స్పష్టం చేయడం, అందుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో ప్రతిష్టంభన తొలగే అవకాశం కనిపించడం లేదు.
ఈ అంశం పరిష్కారమైతే అమరిందర్ బీజేపీలో చేరేందుకు అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ ఎమ్యెల్యేలు పెద్దగా రాకపోయినా, కొద్దినెలల్లో ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో బిజెపికి ఒక పెద్ద సిఖ్ నేత లభించినట్లు అవుతుంది. ఆ ప్రభావం వచ్చే ఏడు ఎన్నికలు జరిగే కాంగ్రెస్ తో బిజెపి నేరుగా తలపడే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, గోవా లలో రాజకీయంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.
అయితే వెంటనే బీజేపీలో చేరటమో లేదా మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయటమే ద్వారా నవజ్యోత్ సింగ్ సిద్దు వలే అధికారంకోసం, పదవులకోసం  వెంపర్లాడుతున్నట్లు ప్రజలలో నవ్వులపాలు కావడానికి అమరిందర్ ఇష్టపడకపోవచ్చు. బిజెపి సహితం రైతులకు బలమైన ప్రతినిధిగా అమరిందర్ నిలబడగలిగితే,  ఆయన ద్వారా రైతులతో చర్చలు జరిపి, ఉద్యమాన్ని విరమింపచేసే అవకాశం ఉంటుందని భావించే అవకాశం ఉంది. అందుకనే ఈ విషయంలో బిజెపి కూడా తొందరపాటు ప్రదర్శించడం లేదు.
ఏది ఏమైనా ఈ మొత్తం పరిణామం కాంగ్రెస్ లో గాంధీ కుటుంభం ఆధిపత్యంను సవాల్ చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ముఖ్యమంత్రి అభిష్టంకు వ్యతిరేకంగా సిద్దుకు పిసిసి నాయకత్వం కట్టబెట్టిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు మాటమాత్రం చెప్పకుండా ఆయన ఆ పదవికి రాజీనామా చేయడంతో దిగ్బ్రాంతికి గురవుతున్నారు.