కాంగ్రెస్ లో వరుస రాజీనామాలకు ప్రధాన దోషి రాహుల్!

2019 లోక్ సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన అనంతరం, గత  రెండేళ్లుగా పార్టీలోని నేతలు చేస్తున్న వరుస రాజీనామాలు, తిరుగుబాటులు చేబడుతూ ఉండడంతో పార్టీ మరింతగా బలహీన పడుతూ వస్తున్నది. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ పేలవమైన ఫలితాలు సాధించింది. 
 
లోక్ సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ, ఆ తర్వాత  చెప్పిన ప్రకారం తమ కుటుంభంకు చెందని వ్యక్తిని పార్టీ అద్యక్షుడుగా ఎన్నుకొనే అవకాశం లేకుండా, తల్లి సోనియా గాంధీకి ఆరోగ్యం సహకరింపక పోయినా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటూ, తెరవెనుక నుండి పార్టీపై రాహుల్ పెత్తనం వహించడమే ప్రస్తుత దుస్థితికి కారణంగా పలువురు భావిస్తున్నారు. 
అప్పటి నుండి తరుచూ ఏదో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామానో, తిరుబాటో చేయడం వార్తల్లో సాధారణ వార్త అయిపోయింది. ఈ కుదుపులతో కర్నటక, మధ్య ప్రదేశ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయాయి.  కర్ణాటకలో జూలై మొదటి వారంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి, బిజెపి అధికారంలోకి వచ్చింది.
ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కీలక నేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింథియా తనకు మద్దతుగా ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అనంతరం సింథియాతో కలిసి బీజేపీలో చేరిపోయారు. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి తలిగిన అతిపెద్ద ఎదురుదెబ్బ ఇదేనని అంటుంటారు. సింధియా రాహుల్ కు సన్నిహితుడు కావడం గమనార్హం.
 
మధ్యప్రదేశ్ కొనసాగింపులోనే ముందు నుంచి వస్తున్న అంచనాల ప్రకారమే రాజస్తాన్ కాంగ్రెస్ అధినేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. తనకు మద్దతుగా ఉన్న 20కి పైగా ఎమ్మెల్యేలతో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. సచిన్ సహితం రాహుల్ సన్నిహితుడే. 
 
 అయితే గెహ్లాట్ చాతుర్యం వల్ల బల పరీక్షలో గెహ్లాట్ ప్రభుత్వం గెలిచింది. దీంతో సచిన్ పైలట్ వెనక్కి రాక తప్పలేదు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న తీవ్రమైన సంక్షోభాలు ఇవి. కాగా ఇతర రాష్ట్రాల్లో అనేక మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసి వేరే పార్టీల్లో చేరారు. ప్రస్తత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వ్యక్తే.

కాగా,  ప్రస్తుతం పంజాబ్‌లో పరిణామాలైతే మరింత తీవ్రంగా ఉన్నాయి. వరుస ఓటముల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ కాస్త ఆశాజనంగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా పంజాబ్‌‌లో ఉన్న మొత్తం 13 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది. అంతే కాకుండా 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 77 స్థానాలో ఉండడంతో కాంగ్రెస్‌లో కొంత విశ్వాసం ఉండేది. 

అయితే పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, ఆ వెంటనే పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేయడం పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా దెబ్బకొట్టింది. ముఖ్యమంత్రి అభిష్టంకు వ్యతిరేకంగా సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించిన రాహుల్ ఈ మొత్తం సంక్షోభానికి కారకుడిగా మారారు. 

ప్రజలలో పట్టు గల సీనియర్ నేతలను  ప్రాధాన్యాల విషయంలో  పట్టించుకోకుండా, నిలకడలేని యువనేతలు రాహుల్ ప్రోత్సహిస్తూ ఉండడమే పార్టీలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణంగా భావిస్తున్నారు.  పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో కూడా అధిష్టానం విఫలమవుతోందని, పార్టీ ప్రస్తుతం నాయకత్వ సమస్యను ఎదుర్కోంటోందని అనేకానేక గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

కాంగ్రెస్ కు సారధి లేరు 

కాగా, కాంగ్రెస్ పార్టీకి సారథి లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకొంటున్నారో తనకు తెలియదని ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలని గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ వ్రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల పక్షాన మాట్లాడుతున్నానని చెబుతూ  పార్టీ అధ్యక్ష పదవికి, సీడబ్ల్యూసీకి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ పార్టీ నాయకత్వం చేపట్టబోయే చర్యల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. 

తాము (జీ-23 నేతలు)  పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారం కాదని, పార్టీ అధిష్ఠానానికి సన్నిహితులుగా పేరుపడినవారు అధిష్ఠానాన్ని వదిలిపెట్టారని, అధిష్ఠానానికి సన్నిహితులుకానివారుగా పేరుపడినవారు అధిష్ఠానంతో కలిసి ఉన్నారని అంటూ ఎద్దేవా చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఈ విధంగా జరుగుతోందంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు.

దీనివల్ల పాకిస్థాన్‌కు, ఐఎస్ఐకి ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించారు. పంజాబ్ చరిత్ర మనకు తెలుసునని, అక్కడ తీవ్రవాదం పెరగడం గురించి తెలుసునని పేర్కొన్నారు. తాము జీ-23 నేతలమని, జీ హుజూర్ 23 నేతలం కాదని అందరూ తెలుసుకోవాలని అధిష్ఠానంకు హితవు చెప్పారు. తాము మాట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

మరోవంక,  కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచడానికి రాహుల్ గాంధీ ఒక్కరు చాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. . వయనాడ్ ఎంపీ (రాహుల్) ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ముంచడానికి బీజేపీ ఏమీ చేయాల్సిన పని లేదని స్పష్టం చేశారు.

పటిష్టంగా ఉన్న పంజాబ్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెల్లుచీటి చెప్పారని, సిద్ధూ కారణంగానే కెప్టెన్ అమరీందర్‌ను సీఎం పదవి నుంచి తప్పించారని పేర్కొన్నారు. ఇప్పుడు సిద్ధూ కూడా పలాయనం చిత్తగిస్తున్నారని చెబుతూ రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తాము (బీజేపీ) చేయాల్సినదేమీ లేదని తెలిపారు.