భవానీపూర్ లో టీఎంసీ నేతలు బూత్ ల ఆక్రమణ

భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో టీఎంసీ నేతలు బూత్ ల ఆక్రమణకు యత్నిస్తున్నారని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. గురువారం ఓటింగు ప్రారంభమైన కొన్ని నిమిషాల తర్వాత టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా ఉద్ధేశపూర్వకంగా ఒక పోలింగ్ బూత్ లో ఓటింగు యంత్రాన్ని మూసివేశారని ప్రియాంక ఫిర్యాదు చేశారు.
 
‘‘మదన్ మిత్రా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఓటింగ్ యంత్రాన్ని మూసివేశారు, ఎందుకంటే అతను బూత్‌ను స్వాధీనం చేసుకోవాలనుకున్నారు’’ అని ప్రియాంక గురువారం బూత్ సందర్శన సందర్భంగా ఆమె చెప్పారు. 
 
బెంగాల్ ప్రభుత్వం ఓటమి భయంలో ఉందని బీజేపీ అభ్యర్థి  ధ్వజమెత్తారు.‘‘ప్రజలు బయటకు వచ్చి ఓటు వేస్తే, మీరు ఫలితాలు చూస్తారు’’ అని టిబ్రేవాల్ హెచ్చరించారు. భవానీపూర్ లో ఉప ఎన్నికల సందర్భంగా భారీ భద్రతతోపాటు 144 సెక్షన్ ను విధించారు.  

దేశంలోనే కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భారీ సాయుధ బలగాల భద్రత మధ్య భవానీపూర్ సెగ్మెంటులో పోలింగ్ సాగుతోంది.టీఎంసీ అభ్యర్థి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీకి చెందిన న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ పోటీ పడుతున్నారు.

ప్రతిష్ఠాత్మక మైన భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో కేంద్రం 15 కంపెనీల బలగాలను మోహరించింది. ‘‘కేంద్ర పారామిలటరీ బలగాల బందోబస్తు మధ్య ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగుతోందని భావిస్తున్నాను. నేను పోలింగ్ కేంద్రాలను సందర్శించాను, రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది’’ అని బీజేపీ అభ్యర్థిని ఆశాభావం వ్యక్తం చేశారు.

భవానీపూర్ తో పాటు జంగిపూర్, షంషేర్ జంగ్ అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ భారీభద్రత మధ్య సాగుతోంది.