రెండేళ్లలో జ్రమ్మూ కశ్మీర్, లడఖ్‌ల స్వరూపంలో మార్పు

రెండేళ్లలో జ్రమ్మూ, కశ్మీర్, లడఖ్‌ల స్వరూపాన్నే మార్చి వేస్తామని  కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చారు. రెండేళ్లలో ఇక్కడ మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. నిధుల లభ్యత సమస్యేమీ కాదని, అయితే భూ సేకరణ, ఇతర పనులకు స్థానికుల సహకారం అవసరమని ఆయన చెప్పారు. 

లడఖ్‌లో నిర్మాణంలో ఉన్న జోజిలా సొరంగం నిర్మాణం పనులను మంత్రి పరిశీలిస్తూ లడఖ్, జమ్మూ, కశ్మీర్‌లో సొరంగాలనిర్మాణం కోసమే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని, రాబోయే రెండేళ్లలో కేంద్రం ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో అభివృద్ధి స్వరూపాన్ని మార్చి వేస్తుందని హామీ ఇచ్చారు.

సొరంగం నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈ సొరంగం లడఖ్, కశ్మీర్‌లకు అభివృద్ధి కారిడార్‌గా ఉండబోతోందని ఆయన చెప్పారు. ఈ సొరంగం నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్నదైనప్పటికీ గడువులోగానే దీన్ని పూర్తి చేయగలమన్న ఆశాభావాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. 

కశ్మీర్‌, లేహ్‌, లద్దాఖ్‌ ప్రజలకు ఈ మార్గం జీవనరేఖగా మారుతుందని గడ్కరీ తెలిపారు. స్థానిక ప్రజలకు పర్యాటకం, ఆతిథ్యం పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 

సొరంగమార్గాన్ని 2026లో పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, 2023 డిసెంబర్‌ నాటికి సిద్ధం చేసేందుకు కృషిచేయాలని ఆయన నిర్మాణసంస్థకు సూచించారు. రహదారుల నిర్మాణంతోనే కశ్మీర్‌ సమగ్రాభివృద్ధి సాధ్యమని మంత్రి నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌వ్యాలీలో రూ.లక్ష కోట్లతో ఆరు కీలక రహదారుల ప్రాజెక్టులను చేపట్టినట్టు వివరించారు.

రవాణా సదుపాయాలు సక్రమంగా లేకపోవడం, ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే రాకపోకల వల్ల జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి చెందడం లేదని చెప్పారు. చలికాలంలో రోడ్లన్నీ మంచుతో మూసుకుపోవడం వల్ల స్థానిక ప్రజలతోపాటు, రక్షణ బలగాలకు ఆహారం, ఇతర వస్తువులను అందించడం కష్టతరంగా మారిపోయిందని వివరించారు.

 ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (11,575 అడుగులు) నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇదే కావడం విశేషం. శ్రీనగర్‌, లేహ్‌-లద్దాఖ్‌ ప్రాంతానికి మధ్య ఉన్న జాతీయ రహదారి నెం.1లో జోజిలా పాస్‌ కీలకమైంది. రక్షణపరంగా వ్యూహాత్మకమైంది. అయితే మంచు కారణంగా కొన్ని నెలలపాటు వాహన రాకపోకలు నిలిచిపోతుంటాయి. జోజిలా టన్నెల్‌ నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రాకపోకలకు అంతరాయం ఉండదు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జోజిలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. సొరంగంలో ఎల్‌ఈడీ లైట్లు, సీసీ కెమెరాలు, టెలిఫోన్‌, ఫైర్‌ అలార్మింగ్‌ వ్యవస్థ వంటి సౌకర్యాలు ఉంటాయి. గాలి, వెలుతురు, భద్రత కోసం సొరంగం పైనుంచి మూడు వెంటిలేషన్‌ మార్గాలను ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు. 

బల్తాల్‌ వద్ద కొండ ప్రాంతాల్లో మొదలై మీనా మార్గ్‌ వద్ద సొరంగ మార్గం ముగుస్తుంది. మొత్తం 14.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని ప్రస్తుతం ఉన్న 40 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకు తగ్గిస్తుంది.