మనీలాండరింగ్‌ కేసులో ఎంపీకి శివసేన ఈడీ నోటీసులు

మానిలాండరింగ్‌ కేసులో శివసేన ఎంపీ భావనా గావ్లికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం వచ్చే నెల 4న దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇప్పటికే మానిలాండరింగ్‌ కేసులో మంగళవారం భావనకు సన్నిహితుడైన సయీద్‌ ఖాన్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత పీఎల్‌ఎంఏ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు అక్టోబర్‌ 1 వరకు సయీద్‌ను ఈడీకి అప్పగించింది. సయీద్‌ఖాయన్‌పై కోట్ల రూపాయల దుర్వినియోగం కేసు ఉంది.

అరెస్ట్‌ తర్వాత సయీద్‌, ఎంపీల మధ్య సంబంధాలపై ఈడీ ప్రశ్నిస్తోంది. రూ.18కోట్ల దుర్వినియోగం కోసం ‘మహిళా ఉత్కర్ష్‌ ప్రతిష్ఠాన్‌’ అనే ట్రస్ట్‌ను ప్రైవేటు కంపెనీగా మార్చేందుకు ఎంపీ భావన.. సయీద్‌ ఖాన్‌ ద్వారా కుట్ర పన్నినట్లు ఈడీ అనుమానిస్తోంది.

ఇప్పటివరకు జరిగిన విచారణలో, రూ.18.18 కోట్ల దుర్వినియోగంతో పాటు, రూ.7కోట్లు దోపిడీకి గురైనట్లు వెలుగులోకి వచ్చిందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఫోర్జరీ సంతకాలతో ట్రస్ట్‌ నుంచి రూ.69కోట్లు కొత్త కంపెనీకి బదిలీ చేశారని ఈడీ పేర్కొంది.