దేశ సంపద సృష్టికర్తలైన ఎంఎన్సీలకు వ్యతిరేకం కాదు

భారతదేశ సంపద సృష్టికర్తలు లేదా బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లకు తాము వ్యతిరేకం కాదని స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎన్‌జేఎం) జాతీయ కో-కన్వీనర్‌ డా. అశ్వని మహాజన్ స్పష్టం చేశారు. అమెజాన్ సంస్థను ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ 2.0’గా పేర్కొంటూ ప్రముఖ హిందీ వార పత్రిక  పాంచజన్య ప్రచురించిన కథనంపై స్పందిస్తూ ఎంఎన్సీ అయినా లేదా దేశీయ సంస్థ అయినా భారత చట్టాల ప్రకారం నడుచుకోవాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. 
 
వ్యాపార ప్లాట్‌ఫారమ్ లాగానే ప్రవర్తించాలని, డిస్కౌంట్‌లు ఇవ్వకూడదని, వస్తువుల జాబితాను ఉంచే హక్కు వారికి లేదని ఆయన స్పష్టం చేశారు. అమెజాన్ ఇస్తున్న భారీ డిస్కౌంట్ల ప్రక్రియ ఇకనైనా ముగియాలని అశ్వని మహాజన్ సూచించారు. భారీ డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా చిన్న వ్యాపారుల మార్కెట్‌ను ఆ సంస్థ దెబ్బ తీస్తున్నదని విమర్శించారు.
వినియోగదారుల మొత్తం డేటాను కూడా నియంత్రిస్తున్నదని ఆయన ఆరోపించారు. వినియోగదారుల ప్రవర్తన, చలనశీలత, ఆర్థిక, సామాజిక స్థితి మొదలైనవి ఆధారంగా వారి డిమాండ్‌ నమూనా ఉండాలని ఆయన పేర్కొన్నారు. డేటా, వలసరాజ్యాల మార్కెట్‌ స్వేచ్ఛకు కట్టుబడి వ్యాపారంలో న్యాయమైన పోటీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.