బ్యాడ్‌ బ్యాంకుకు లక్ష కోట్ల మోసపూరిత రుణాలు!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బ్యాడ్‌ బ్యాంక్‌.. నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) కు వివిధ బ్యాంకులు తమ ఫ్రాడ్‌ లోన్స్‌ విక్రయించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు రూ.లక్ష కోట్ల మోసపూరిత రుణాలను అమ్మే అవకాశాలు కనిపిస్తున్నది.

దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి రావడమే తరువాయి అని తెలుస్తున్నది. రుణదాతలకు ఫ్రాడ్యులెంట్‌ రుణాలను విక్రయించడానికి అనుమతించిన తర్వాత బ్యాంకులు  ఎన్‌ఏఆర్‌సీఎల్‌, ఇతర ఏఆర్సీలకు దాదాపు రూ.లక్ష కోట్ల మోసపూరిత రుణాలను విక్రయించే అవకాశం ఉన్నది.

ఆర్బీఐ డాటా ప్రకారం, గత మూడేండ్లలో రూ.3.95 లక్షల కోట్ల రుణ మోసాలను బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకుల ఈ చర్య బ్యాడ్‌ బ్యాంక్‌కు రూ.2 లక్షల కోట్ల రుణాలను పొందాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.

మోసపూరిత రుణాలను బ్యాడ్‌ బ్యాంకుకు అమ్ముకునేందుకు ఆమోదం తెలుపాల్సిందిగా గతవారం రిజర్వ్‌ బ్యాంకును పలు బ్యాంకులు, అసెట్‌ మేనేజర్లు కోరాయి. రూ.2 లక్షల కోట్ల సేకరణ లక్ష్యాన్ని కలిగి ఉన్న ఎన్‌ఏఆర్‌సీఎల్‌, ఇప్పటికే రూ.89,000 కోట్ల రుణాలను గుర్తించింది. ఈ ఫ్రాడ్‌ రుణాలపై ప్రభుత్వం దాదాపు రూ.31,000 కోట్ల హామీని ఇచ్చింది.