ప‌ట్టుబ‌డిన పాక్ ఉగ్రవాది.. మ‌రొక‌రు హ‌తం

ల‌ష్క‌రే తోయిబాకు చెందిన 19 ఏళ్ల ఉగ్ర‌వాదిని భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌ట్టుకున్నాయి. జ‌మ్ముక‌శ్మీర్‌లోని ఉరి ద‌గ్గ‌ర నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి జ‌రిపిన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్‌లో మ‌రో ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చారు. ప‌ట్టుబ‌డిన ఉగ్ర‌వాది పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు చెందిన‌వాడు. 

త‌న పేరు అలీ బాబ‌ర్ పాత్రా అని అత‌డు చెప్పిన‌ట్లు మేజ‌ర్ జ‌న‌ర‌ల్ వీరేంద్ర వెల్ల‌డించారు. తాను ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదిన‌ని, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ముజ‌ఫ‌రాబాద్‌లో త‌న‌కు శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు అత‌ను విచార‌ణ‌లో చెప్పాడు. గ‌త ఏడు రోజులలో ఏడుగురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ తెలిపింది.

లష్కర్ ఎ తొయిబాకు చెందిన అలీ బాబర్ విచారణలో అనేక కీలక విషయాలు వెల్లడించాడు. లష్కర్ ఎ తొయిబాకు చెందిన గర్హీ హబీబుల్లా క్యాంప్‌లో 2019లో మూడు వారాల శిక్షణ తర్వాత తనకు 20 వేల రూపాయలిచ్చి ఐఎస్ఐకి అప్పగించారని చెప్పాడు. ఆ తర్వాత పాక్ ఆర్మీ తమకు శిక్షణ ఇచ్చిందని చెప్పాడు. కశ్మీర్‌లోకి చొరబడితే తన కుటుంబానికి 30 వేల రూపాయలు ఇస్తామని తనకు మాటిచ్చారని చెప్పాడు.

తండ్రి చనిపోయి తన కుటుంబం పేదరికంలో మగ్గిపోతున్న సమయంలో పాఠశాల చదువు మానేసి లష్కర్ ఎ తొయిబాలో చేరానని అలీ బాబర్ చెప్పాడు. తన తల్లి, సోదరి దిపాల్‌పూర్‌లో ఉంటున్నారని తెలిపాడు. తనతో పాటు మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాక్ ఆర్మీకి చెందిన జాబ్రి పోస్ట్ నుంచి నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించామన్నాడు. పాక్ చేయిస్తున్న జిహాద్ తప్పుడుదని పాక్ యువతకు చెప్పాలనుందని అలీ బాబర్ తెలిపాడు.

పాకిస్థాన్ ఆర్మీ సాయం లేకుండా స‌రిహ‌ద్దులో ఇంత మంది క‌ద‌లిక‌లు అసాధ్య‌మ‌ని, నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న అన్ని ఉగ్ర‌వాద స్థావ‌రాల్లో క‌ద‌లిక‌లు ఉన్నాయ‌ని మేజ‌ర్ వీరేంద్ర చెప్పారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో పాకిస్థాన్‌తో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం త‌ర్వాత నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఇండియ‌న్ ఆర్మీ సాగించిన అతి పెద్ద ఆప‌రేష‌న్ ఇదే. ఈ నెల 18 నుంచి ఈ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. గ‌త మూడు రోజుల‌లో న‌లుగురు జ‌వాన్లు కూడా గాయ‌ప‌డ్డారు.