అవినీతి పోలీస్ అధికారులకు రక్షణ కల్పించలేం!

మునుపటి ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ అక్రమార్జనకు పాల్పడే అదికారులు  ప్రభుత్వం మారిన తరువాత వాటిని దిరిగి చెల్లించే పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొంటూ అలాంటి పోలీస్ అధికారులకు రక్షణ కల్పించలేమని, వారిని తప్పకుండా జైలుకు పంపించాల్సిందేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. 

అక్రమాస్తుల కేసులో సస్పెండైన ఐపిఎస్ అధికారి గుర్జీందర్‌పాల్ సింగ్  తనను అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

“మీరు ప్రతి కేసులో రక్షణ పొందలేరు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ దోపిడీకి పాల్పడ్డారు. ఇలాంటి పనులు చేస్తే ఇదే విధంగా జరుగుతుంది. ఏదో ఒకరోజు మూల్యం చెల్లించాల్సిందే. దేశంలో ఇదో కొత్త ధోరణి కనిపిస్తోంది. ఇలాంది అధికారులకు రక్షణ ఎందుకు కల్పించాలి?” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు. 

ఇదే సమయంలో తనలాంటి అధికారులకు రక్షణ అవసరమని సింగ్ తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయగా, దానికి చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన గుర్జీందర్ పాల్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తరువాత పోలీస్ అకాడమీ డైరెక్టర్ (అదనపు డిజిపి హోదా)గా నియమితులయ్యారు.

ప్రభుత్వం మారిన తరువాత అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసుల కారణంగా గుర్జీందర్ పాల్ సస్పెండ్ అయ్యారు. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ రాజద్రోహం కేసు కూడా నమోదైంది.

రాజద్రోహం కేసు కొట్టి వేయాలంటూ మొదట ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దాంతో సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా రెండు కేసుల్లోనూ నాలుగు వారాల పాటు ఎలాంటి అరెస్టు చేయకూడదంటూ ఆగస్టు 26న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని సింగ్‌కు సుప్రీం కోర్టు సూచించింది.

తాజాగా దోపిడీకి సంబంధించిన మరో కేసు లోనూ రక్షణ కల్పించాలంటూ సింగ్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం అన్ని కేసుల్లో రక్షణ పొందలేరని, అక్రమార్జనకు పాల్పడే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.