జర్మనీ లో 16 ఏళ్ల పాటు జర్మనీని ఏలిన ఏంజెలా మెర్కల్ పార్టీ.. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఆదివారం ముగిసిన ఎన్నికల్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీకి అత్యధికంగా 25.7 శాతం ఓట్లు పోలవ్వగా.. ఛాన్సలర్ మెర్కల్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కన్జర్వేటివ్ పార్టీకి 24.1 శాతం ఓట్లు పోలయ్యాయి.
అయితే రెండు పార్టీల మధ్య కేవలం 1.6 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నేత ఓలాఫ్ స్కల్జ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న ఓలాఫ్ క్రిస్మస్ లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రీన్స్, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీల మద్దతు తీసుకొంటామని చెప్పారు.
ఏంజెలా మెర్కల్ పార్టీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాలని ఈ ఎన్నికలలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని 63 యేండ్ల ఓలాఫ్ స్పష్టం చేసారు. అయితే కన్జర్వేటి నేత ఆర్మిన్ లాషెట్ కూడా విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నించనున్నారు. గతంలో రెండు పార్టీలు కలిసి పనిచేసినా, ఈ సారి మాత్రం ఆ ఇద్దరూ వేరువేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని గ్రీన్స్, లిబరల్ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి.
30 ఏళ్ల లోపు ఓటర్లే సోషల్ డెమోక్రటిక్, క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీలకు ఎక్కువ శాతం ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్స్ పార్టీ కూడా 15 శాతం ఓట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. మెర్కల్ అనంతర ప్రభుత్వ ఏర్పాటు కోసం సోషల్ డెమోక్రాట్లు కచ్చితంగా మరో పార్టీ సహాయం తీసుకోవాల్సిందే.
అయితే జర్మనీ ఎన్నికల సరళి ప్రకారం.. ఒకవేళ విజేతగా నిలిచిన పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, అప్పుడు పోటీలో రెండవ స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం అవకాశం ఇస్తారు. అందుకే కూటమి ప్రభుత్వ ఏర్పాటు కోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ కచ్చితంగా మరో పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే.
16 ఏళ్ల పాటు జర్మనీ ఛాన్సలర్‌గా చేసిన మెర్కల్ పోటీ నుంచి తప్పుకున్నారు. యూరోప్‌లో సమర్థవంతమైన నేతగా ఎదిగిన ఆమె దశాబ్ధ కాలంగా జర్మనీని ప్రగతిపథంలో నడిపారు. రెండవ ప్రపచం యుద్ధం తర్వాత మళ్లీ మెర్కల్ పాలనలో జర్మనీ శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది. తాజా ఎన్నికల్లో ఎస్‌డీపీ గెలుపుతో మెర్కల్ శకం ముగిసినట్లు అయ్యింది. కానీ కొత్త ఛాన్సలర్ ఎన్నిక ఇంకా అస్పష్టంగానే ఉన్నది.
More Stories
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హతం
షేక్ హసీనాను అప్పగించమని కోరటం లేదన్న యూనుస్
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండించిన ట్రంప్