చైనా ఫోన్ల‌ను విసిరి కొట్టండి.. లిథుయేనియా

 చైనా ఫోన్ల‌ను విసిరి కొట్టండి అంటూ లిథుయేనియా ప్ర‌భుత్వం త‌మ ప్ర‌జ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు భ‌విష్య‌త్తులోనూ వాటిని కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పింది.  ముఖ్యంగా చైనాకు చెందిన షియోమీ, హువావీ స్మార్ట్‌ఫోన్ల‌ను కొన‌కూడ‌ద‌ని, ఇప్ప‌టికే ఉన్న ఫోన్ల‌ను పారేయాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

దీని వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. ఈ కంపెనీల ఫోన్ల‌లో ఉన్న సెన్సార్‌షిప్ కార‌ణంగా కొన్ని ప‌దాల‌ను ఇవి ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తోంది. అక్క‌డి ర‌క్ష‌ణ శాఖకు చెందిన‌ నేష‌న‌ల్ సైబ‌ర్ సెక్యూరిటీ సెంట‌ర్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో ఈ ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ ఫోన్లలోని సెన్సార్‌షిప్ కార‌ణంగా ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌, డెమొక్ర‌సీ మూవ్‌మెంట్ వంటి 449 ప‌దాలను ఈ ఫోన్లు ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తున్నాయ‌ని అక్క‌డి ర‌క్ష‌ణ శాఖ వెల్ల‌డించింది. షియోమీ ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్‌లోనూ ఈ సెన్సార్‌షిప్ క‌నిపించిన‌ట్లు లిథుయేనియా సైబ‌ర్ సెక్యూరిటీ తెలిపింది.

దీంతో చైనా ఫోన్ల‌ను కొనొద్దంటూ లిథుయేనియా ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియ‌స్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇప్ప‌టికే ఆ ఫోన్లు ఉంటే వాటిని ప‌క్క‌న పెట్టాల‌ని ఆదేశించారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను షియోమీ సంస్థ ఖండించింది. త‌మ ఫోన్ల‌లో అలాంటి సెన్సార్‌షిప్ ఏదీ లేద‌ని చెప్పింది.