ఆఫ్ఘన్ గడ్డను ఉగ్రవాద వ్యాప్తికి అనుమతించరాదు

ఆఫ్ఘనిస్తాన్ భూభాగం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి లేదా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూసుకోవడం అత్యవసరం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సమావేశంలో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ  “నేడు, ప్రపంచం తిరోగమన ఆలోచన, తీవ్రవాదం యొక్క  చూస్తోంది. ఈ పరిస్థితిలో, సైన్స్ ఆధారిత, హేతుబద్ధమైన మరియు ప్రగతిశీల ఆలోచన కోసం ప్రపంచాన్ని ఒక సైట్‌గా మార్చడం అవసరం” అని సూచించారు.
ఆఫ్ఘన్ పరిణామాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెబుతూ అక్కడ ఉన్న సున్నితమైన పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ఏ దేశమూ ప్రయత్నించకుండా, దానిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు –  మహిళలు, పిల్లలు,  మైనారిటీలకు సహాయం కావాలని చెబుతూ దానిని అందించడం ద్వారా మనం మా విధులను నెరవేర్చాలని సూచించారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని మోదీ దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి వేదికగా చురకలంటించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ స్వర్గధామంగా మారుతోందని పొరుగుదేశాలు గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఐరాస వేదికగా ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు. కొన్ని దేశాలు మాత్రం తీవ్రవాదాన్ని స్వీయప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవాలని తిరోగామి ఆలోచనలు చేస్తున్నాయని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు.
“ప్రజాస్వామ్యంకు తల్లి” భారత్ 
“ప్రజాస్వామ్యంకు తల్లి” గా పరిగణించబడే దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉందని చెబుతూ ఈ ఏడాది ఆగస్టు 15న, భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 వ సంవత్సరంలోకి ప్రవేశించిందని ప్రధాని తెలిపారు.  “మా వైవిధ్యం మా ప్రజాస్వామ్యానికి గుర్తింపు. మాకు డజన్ల కొద్దీ భాషలు, వందలాది మాండలికాలు, విభిన్న జీవనశైలి,  వంటకాలు ఉన్నాయి – ఇది ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ” అని పేర్కొన్నారు.
తన తండ్రికి రైల్వే స్టేషన్‌లో టీ అమ్మడానికి సహాయం చేసే ఒక చిన్న పిల్లవాడు నేడు ఐక్యరాజ్యసమితి జనరల్ని అసెంబ్లీలో  భారత ప్రధానిగా సంబోధిస్తున్నాడని గుర్తు చేశారు. 20 సంవత్సరాలుగా, తోలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానిగా భారత ప్రజలకు సేవ చేయగలుగుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
 “నేను నా అనుభవం నుండి చెబుతున్నాను. అవును, ప్రజాస్వామ్యం ఫలితాలు అందీయగలదు”  అంటూ భరోసా వ్యక్తం చేశారు. అభివృద్ధి అనేది అన్నింటినీ కలుపుకొని, సర్వవ్యాప్తమై, సార్వత్రికంగా ఉండడమే తమ ప్రాధాన్యత అని తెలిపారు. “నేడు ప్రపంచంలో ప్రతి ఆరవ వ్యక్తి భారతీయుడు. భారతీయులు అభివృద్ధి చెందినప్పుడు, అది ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. భారతదేశం పెరిగినప్పుడు,  ప్రపంచం పెరుగుతుంది. భారతదేశం సంస్కరించినప్పుడు, ప్రపంచం మారుతుంది” అని ప్రధాని చెప్పుకొచ్చారు.
 
తొలి డీఎన్‌ఏ టీకా భారత్‌దే
 
క‌రోనా వేళ భార‌త్ వ్యాక్సిన్ హ‌బ్‌గా నిలిచింద‌ని చెబుతూ  ప్ర‌పంచంలోని వ్యాక్సిన్ తయారీదారులంద‌రినీ భార‌త్‌లో వ్యాక్సిన్‌ల తయారీకి ముందుకు రావాల‌ని  ప్రధాని ఆహ్వానించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఎ టీకాను భారతదేశం అభివృద్ధి చేసిందని చెబుతూ  ఇది 12. కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా ఇవ్వవచ్చని తెలిపారు.  
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కూడా తుది ద‌శ‌లో ఉన్న‌ద‌ని, భార‌త శాస్త్ర‌వేత్త‌లు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ల‌ను కూడా అభివృద్ధి చేస్తున్నార‌ని ప్ర‌ధాని చెప్పారు. క‌రోనా స‌మ‌యంలోనూ భార‌త్‌లో మూడు కోట్ల మందికి ఇండ్లు క‌ట్టిచ్చామ‌ని పేర్కొన్నారు. దేశంలో ఆరు ల‌క్ష‌ల గ్రామాల‌ను డ్రోన్ మ్యాపింగ్ చేశామ‌ని, అంతేగాక ప‌లు డిజిట‌ల్ సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నామ‌ని ప్ర‌ధాని చెప్పారు.
“భారతదేశం ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ శాస్త్రం మధ్య మెరుగైన సమతుల్యతను సాధించింది. పెద్ద, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, భారతదేశంలో వాతావరణ చర్యల పనిని చూసి మీరు గర్వపడతారు. ఈ రోజు, మేము 450 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చడానికి మేము కృషి చేస్తున్నాము” అని ప్రధాని వివరించారు.
“మన మహాసముద్రాలు కూడా వారసత్వ సంపద. మనం సముద్ర వనరులను మాత్రమే ఉపయోగించాలి తప్ప వాటిని దుర్వినియోగం చేయకూడదు. అవి అంతర్జాతీయ వాణిజ్యం జీవనాడి. మనం వాటిని విస్తరణ, మినహాయింపు రేసు నుండి కాపాడాలి” అని మోదీ పిలుపిచ్చారు.
 
 ఐరాస విశ్వనీయత పెంచుకోవాలి 
ఐక్యరాజ్యసమితి నేటి కాలానికి అవసరమైనదిగా ఉండాలంటే దాని  దాని ప్రభావాన్ని మెరుగుపరచాలని,  విశ్వసనీయతను పెంచుకోవాలని ప్రధాని చురకలు అంటించారు. సమితిపై అనేక ప్రశ్నలు తలెత్తాయని చెబుతూ ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంతో సహా ప్రపంచంలోని వివిధ మూలల్లో వాతావరణ సంక్షోభం, కోవిడ్ -19, ప్రాక్సీ యుద్ధాలు, తీవ్రవాదం ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయని చెప్పారు.  
 
ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలనుకుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలని ప్రధాని హితవు చెప్పారు. 
 
ఈ సంవత్సరం సమితి జనరల్ అసెంబ్లీ అంశం ‘కరోనానుండి కోలుకోవాలని, నిలకడగా పునర్నిర్మించాలని, భూగోళం అవసరాలకు ప్రతిస్పందించండి, ప్రజల హక్కులను గౌరవించండి- మరియు ఐక్యరాజ్యసమితి పునరుజ్జీవనం ‘ అంశంపై మాట్లాడిన మొదటి ప్రపంచ నాయకుడు ప్రధాని మోదీ. 
దాదాపు 109 మంది దేశాధినేతలు, ప్రభుత్వ నాయకులు చర్చలో వ్యక్తిగతంగా మాట్లాడతారు. దాదాపు 60 మంది ముందుగా రికార్డ్ చేసిన వీడియో  ప్రకటనల ద్వారా ప్రసంగాలు చేస్తారు. ప్రధాని మోదీ  చివరిసారిగా 2019 లో జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు.