దేశ ప్రజల్లో భరోసా నింపిన ఓబిసి కమిషన్ 

దేశ ప్రజల్లో ఓబిసి కమిషన్ భరోసా నింపిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోలో జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓబిసి కమిషన్ ఆశాజనకంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

నేటితో ఓబిసి కమిషన్ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో ఎన్నో సంవత్సరాల పనిని పూర్తిచేసిందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ ఓబిసి కమిషన్ అనేది ప్రజల్లో ధైర్యం, భరోసాతో పాటు ఆశలు నింపిందని ఆమె పేర్కొన్నారు. ఈ కమిషన్ భవిష్యత్‌లో మరింత ఫలప్రదంగా, ఆశాజనకంగా, శక్తివంతంగా, విజయవంతంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ఓబిసి కమిషన్‌ను మనందరి కోసం రాజ్యాంగబద్ధం చేసిన ప్రధాని నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గోర్లు, బర్ల పంపిణీతో కాదు..బిసిలు విద్యతోనే సమాజంలో గౌరవం పొందుతారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా విద్యతోనే సమాజం అభివృద్ధి బాట పడుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. 27 శాతం రిజర్వేషన్లతో బిసిలు మరింత బలపడతారని పేర్కొన్నారు. 

విద్యతోనే సమాజంలో బిసిలకు గౌరవం దక్కుతుందని చెబుతూ  బిసి కమిషన్‌కు గతంలో మాదిరి అధికారాలు లేవని, ఈ కమిషన్‌కు ప్రధాని మోదీ చట్టబద్ధత కల్పించారని గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. రాజ్యాధికారంతోనే బిసిల అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా బిసి నేతలు ఒకే వేదిక మీదకు రావడం సంతోషకరమని దత్తాత్రేయ చెప్పారు. 

రాష్ట్రాల పరిధిలో బిసిలకు రాజ్యాంగ సవరణ చేపట్టే అధికారం ఇచ్చారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ఆడబిడ్డలకు ఆత్మగౌరవం కల్పించేందుకు ఇంటింటికి టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన బిసి రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టామని చెబుతూ ఏ ప్రభుత్వమైనా బిసి కమిషన్ ఆదేశాలు అమలుచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. 

కొన్ని ప్రభుత్వాలు కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ బిసి కమిషన్ ఆదేశాలు అమలు చేయకపోతే అండగా నిలవాల్సిన బాధ్యత బిసి సంఘాలదేనని స్పష్టం చేశారు. కేంద్రమంత్రివర్గంలో 27 మంది బిసిలు ఉన్నారని గుర్తు చేశారు.