కేసీఆర్ 8 మంది బిసిలను మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి 

బిసిల పట్ల చూపుతున్న సవతితల్లి ప్రేమను విడనాడి ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో 9 మంది బిసిలకు స్థానం ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో కేవలం ముగ్గురు మాత్రమే బిసిలు ఉన్నారని ఆయన చెప్పారు. ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి బిసిల పట్ల తనకున్న సవతి తల్లి ప్రేమను, అక్కసును కేసీఆర్ వెల్లడి చేశారని ధ్వజమెత్తారు. 

బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేసీఆర్ కు వ్రాసిన ఏడు పేజీల బహిరంగ లేఖలో కేంద్రంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో 27 మంది బిసిలకు చోటు కల్పించారని గుర్తు చేశారు. అదే విధంగా జాతీయ బిసి కమీషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన ఘనత కూడా ప్రధాని మోడీదే స్పష్టం చేసారు. 

బిసి బంధు పధకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి, అర్హులైన ప్రతి బిసి కుటుంభానికి రూ 10 లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని సంజయ్ డిమాండ్ చేశారు. జనాభాలో  50 శాతానికి  పైగా  వున్న  బీసీల  సంక్షేమం  కోసం  బీసీ  బంధు  పథకం   ప్రారంభించాలిసిన  ఆవశ్యకత   ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  

బిసిల పట్ల తమ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వైఖరిని కొనసాగిస్తే, సవతి తల్లి ప్రేమను కొనసాగిస్తే, వారి పక్షాన బిజెపి నిలబడి ప్రభుత్వంపై వారి అభ్యున్నతి కోసం పోరాటాలు చేస్తుందని సంజయ్ హెచ్చరించారు. 

తెరాస  ప్రభుత్వం  హయంలో బీసీ సబ్  ప్లాన్  ఆటకెక్కినదని సంజయ్ విమర్శించారు. దానిని వెంటనే తిరిగి ప్రవేశ పెట్టి,  దానికి చట్టబద్దత కల్పించాలని సంజయ్ డిమాండ్ చేశారు. 46 బీసీ   కులాలకు నిర్మిస్తాము  అన్న  ఆత్మ గౌరవ   భవనాలకు  అడ్రస్ లేకుండా పోయినదని ధ్వజమెత్తారు. 

కొర్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, యాంత్రీకరణ కారణంగా బిసి వర్గాలు తమ కులవృత్తులను, చేతి వృత్తులను కోల్పోయి, వాటిపైననే ఆధారపడిన వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర జనాభాలో సగంకు పైగా గల బిసి వర్గాలవారిని ప్రభుత్వం ఆదుకోవలసిన అవసరం ఉన్నదని సంజయ్ స్పష్టం చేశారు. 

తాను జరుపుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తనను కలసిన అనేకమంది బిసిలు తమ దైన్య పరిస్థితులను తన దృష్టికి తీసుకొచ్చిన్నట్లు తెలిపారు. వారిలో మనోధైర్యం నింపడం కోసం, వారికి ఆర్ధిక పరిపుష్టి కలిగించడం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అసెంబ్లీ సాక్షిగా బిసి సబ్ ప్లాన్ గురించి నాలుగు సంవత్సరాలైనా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన రూ 3,400 కోట్ల ఫీజు  రీయింబర్సుమెంట్  బకాయిలను  వెంటనే  విడుదల  చెయ్యాలని  సంజయ్ కోరారు. చేనేత  కార్మికులకు  భీమా , హెల్త్  కార్డులు  మంజూరి  చెయ్యాలని  డిమాండ్  చేశారు. గీత  కార్మికులను  ఆదుకోవడానికి  వెంటనే  గీత  కార్పొరేషన ఏర్పాటు  చేయాలని, వారికి మోపెడు  బండ్లు  ఉచితంగా  ఇవ్వాలని సంజయ్ చెప్పారు.  ప్రమాదవశాత్తు  గాయపడిన  గీత  కార్మికులకు  రూ 4 లక్షల  నష్టపరిహారం  ఇవ్వాలని సూచించారు.

దోబీఘాట్  ల  నిర్మాణాలు  వెంటనే   ప్రారంభించాలని , రజకులకు  డ్రైయింగ్  మెషిన్  లు  ఇవ్వాలని , రజకులకు  ఇచ్చిన  హామీలు  నెరవేర్చాలని సంజయ్ స్పష్టం చేశారు. నాయి   బ్రాహ్మణులకు   200 యూనిట్ల  విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలని, ఆధునిక  సెలూన్లు  ఏర్పాటుకు  ఆర్ధిక  సహాయం  అందించాలని ఆయన కోరారు.

గొర్రెలు  పంపిణి  ఎప్పుడు  చేస్తారని సంజయ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.  గొర్రెలు  కోసం   ప్రభత్వానికి డీడీలు  కట్టిన 4 లక్షల  మంది   గొర్రెలు    కోసం  ఎదురు  చూస్తున్నారని ఆయన చెప్పారు. ఎంబీసీ  కార్పొరేషన్  కు   సమృద్ధిగా  నిధులు  కేటాయించాలని కోరారు.