భార‌త్‌కు నాలుగైదు ఎస్బీఐ త‌ర‌హా బ్యాంకులు అవ‌స‌రం

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పురోభివృద్ధికి ఎస్బీఐ వంటి నాలుగైదు పెద్ద బ్యాంకులు అవ‌స‌రం అని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు. ప‌రోక్షంగా మున్ముందు మ‌రికొన్ని బ్యాంకుల విలీనం జ‌రుగుతుంద‌ని సంకేతాలిచ్చారు. 

ముంబైలో ఆదివారం జ‌రిగిన ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ (ఐబీఏ) 74వ వార్షిక స‌ద‌స్సులో ఆమె కీల‌కోప‌న్యాసం చేస్తూ.. మొత్తం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ విభిన్న మార్గం వైపు మ‌ళ్లుతున్న‌ద‌ని తెలిపారు. రూపాంత‌రం చెందుతున్న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌కు ప‌లు కొత్త స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌ని, వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద బ్యాంకులు అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

సుస్థిర భార‌తీయ బ్యాంకింగ్ ప‌రిశ్ర‌మను సృష్టించ‌డంలో నిరంత‌రాయ అనుసంధాన‌మైన డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌లు ముఖ్య‌పాత్ర పోషిస్తాయ‌ని నిర్మ‌లా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌కు సేవ‌ల్లో అంత‌రాయం క‌లుగ‌కుండా బ్యాంకుల విలీనాన్ని స‌జావుగా పూర్తి చేసినందుకు ఆమె  బ్యాంకుల‌ను ప్ర‌శంసించారు.

డిజిటల్ టెక్నాలజీల హేతుబద్ధమైన విధానం. సరైన వినియోగం ద్వారా ప్రతి జిల్లాలో బ్యాంకింగ్ యాక్సెస్ మెరుగుపరచాలని ఆమె ఐబిఎ ను కోరారు. దీనిని సాధించడానికి, దేశంలోని ప్రతి జిల్లాకు సంబంధించిన అన్ని బ్యాంకు శాఖల డిజిటలైజ్డ్ లొకేషన్ వారీగా మ్యాపింగ్ చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. 

“దాదాపు 7.5 లక్షల పంచాయితీలలో దాదాపు మూడింట రెండు వంతుల ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ఉంది. ఐబిఎ దీనిని పరిగణనలోకి తీసుకోని ప్రణాలికను రూపొందించుకోవాలి. బ్యాంకులు ఎక్కడ భౌతిక ఉనికిని కలిగి ఉండాలి, భౌతిక శాఖ లేకుండా కూడా ఎక్కడ ఖాతాదారులకు సేవ చేయగలమో నిర్ణయించుకోవాలి” అని ఆమె సూచించారు.

దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇప్పుడు అత్యధిక స్థాయిలో ఆర్ధిక కార్యకలాపాలు సాగుతున్నాయని చెబుతూ  ఆర్థిక స్రవంతిలోకి అందరినీ మిళితం చేసుకునే క్రమం సాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ దశలో భారీస్థాయిలో ఆర్థిక సంచలిత ప్రక్రి య జరుగుతోందని,కానీఏ బ్యాంకు శాఖలు లేని పలు జిల్లా లు ఉన్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు.

 2వేల మందికి పైగా జనాభా ఉన్న ప్రతి జనావాసపు ప్రాంతానికి ఓ బ్యాంకు తెరవాలని ఇంతకు ముందు లక్షంగా ఎంచుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆర్‌బిఐ కొన్ని చర్యలు కూడా తీసుకుంది. బ్యాంకుల ప్రారంభానికి నిబంధనలను సరళీకృతం చేసిందని గుర్తు చేశారు. పూర్తి స్థాయి బ్యాంకులు లేకపోయినా కనీసం బ్యాంకింగ్ సేవలతో కూడిన కేంద్రాలను అయినా ఏర్పాటు చేయవచ్చునని ఆమె సూచించారు.

జనమంతటిని ఆర్థిక సమ్మిళిత దిశకు తీసుకువెళ్లేందుకు పాలసీనిర్మాతలు దృష్టి కేంద్రీకరిస్తున్నారని, అయితే ఈ దిశలో అనివార్యంఅయిన బ్యాంక్‌ల ఏర్పాటు కాకపోవడం బాధాకరమే అని  ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికీ పలు జిల్లాలో చివరికి పెద్ద పంచాయితీ గ్రామాలలో కూడా బ్యాంకుల శాఖలు లేవని, పలు జిల్లాలకు ఇప్పటికీ అసలు బ్యాంకింగ్ శాఖలతో వ్యవస్థలతో సంబంధం లేని రీతిలో ఏర్పాట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇప్పటికైనా ఇండియ న్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ప్రతినిధులు బ్యాంకుల ఉనికిపై ఆరాతీయాల్సి ఉందని ఆమె సూచించారు.

నేష‌న‌ల్ అసెట్ రీక‌న్స్‌ట్ర‌క్ష‌న్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్‌), ఇండియా డెట్ రీసొల్యూష‌న్ కంపెనీ లిమిటెడ్ (ఐడీఆర్సీఎల్‌) ఏర్పాటులో క‌లిసి ప‌ని చేసినందుకు ఐబీఏకు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. వివిధ బ్యాంకుల మొండి బ‌కాయిల ప‌రిష్కారం, పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఎన్ఏఆర్సీఎల్‌, ఐడీఆర్సీఎల్ క‌లిసి ప‌ని చేస్తాయ‌ని చెప్పారు. ఎన్ఏఆర్సీఎల్ బ్యాడ్ బ్యాంక్ కాద‌ని స్పష్టం చేశారు.