మావోయిస్టుల నిధుల చేరికకు కళ్లెం

మావోయిజాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని, మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులకు సూచించారు.  నక్సల్స్‌కు వివిధ రూపాలలో అందే నిధులను రాకుండా చేయాలని, మావోయిస్టులకు క్షేత్రస్థాయిలో ఊతం అందించే అనుబంధ సంస్థల పనిపట్టాల్సి ఉందని షా తెలిపారు.
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన భేటీలో వామపక్ష తీవ్రవాదుల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం ముఖ్యమని చెప్పారు. ఇలా చేస్తే ఏడాదిలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే దీని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థలు మరింత సమన్వయంతో చురుగ్గా పని చేయాలని సూచించారు.
 అజ్ఞాత మార్గాల ద్వారా మావోయిస్టులకు వివిధ స్థాయిలు, పలు మార్గాల ద్వారా అందే నిధులు ఇతర సాధనాసంపత్తిని గుర్తించి ఇవి చేరకుండా నిరోధించడం ద్వారా నక్సల్ సమస్యకు పరిష్కారం దిశలో అడుగులు వేగం అవుతాయని తెలిపారు. తీవ్రవాద శక్తులకు అందే నిధుల స్వరూపం గురించి పసికట్డటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) , రాష్ట్రాల పోలీసు యంత్రాంగాల సమన్వయం వంటి అంశాలు సిఎంలతో చర్చల దశలో కేంద్రం ప్రస్తావించింది.
దేశంలో నక్సల్స్ కట్టడి మరింత తీవ్రతరం, వారికి నిధుల చేరికకు కళ్లెం ..ఈ రెండు కీలక అంశాలే ప్రధానంగా రాజధాని ఢిల్లీలో ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి ఆరు రాష్ట్రాల సిఎంలు హాజరయ్యారు.
 
  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హాజరయ్యారు.  ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్‌మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ, కేరళ సిఎం పినరయి విజయన్ రాలేదు. వీరి బదులుగా సీనియర్ అధికారులు వచ్చారు. వైఎస్ జగన్ అస్వస్థతతో సమావేశానికి రాలేదు. ఎపి తరఫున హోం మంత్రి మేకపాటి సుచరిత ప్రాతినిధ్యం వహించారు.
 
వామపక్ష తీవ్రవాద ప్రాబల్యాన్నిఅరికట్టేందుకు తీసుకుంటున్న పలు రకాల చర్యలను మరింత విస్తృతం చేసేందుకు కేంద్రం సంకల్పించిందని హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు. మావోయిస్టుల కారణంగా గడచిన 40 సంవత్సరాల్లో 16 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని షా ఆవేదన వ్యక్తం చేశారు.
 
నక్సల్స్ చర్యలను అదుపులో పెట్టేందుకు ముందుగా భద్రతా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మౌలిక స్థాయిలో భద్రతా బలగాలలో ఉండే ఖాళీలను భర్తీ చేయడం తద్వారా ఎక్కడా భద్రతా శూన్యత తలెత్తకుండా చూసుకోవడం కీలకమని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
 
మావోయిస్టుల క్షేత్రస్థాయి సంస్థల వ్యక్తులపై కేసుల విచారణ దర్యాప్తులను వేగవంతం చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల స్థాయిల్లో ఇంటలిజెన్స్ వర్గాల సామర్థం పెంపొందాల్సి ఉంది, ప్రత్యేక బలగాలకు తగు వనరులు సమకూర్చాలి. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో దుర్భేధ్యపు పోలీసు ఠాణాలను ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. 
 
నక్సల్స్ సమస్య ఉన్న ప్రాంతాలలో ఇప్పుడు చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పనితీరును కూడా ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో హోం మంత్రి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అర్విందకుమార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, గిరిరాజ్‌సింగ్, అర్జున్ ముండా , నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.
 
పలు ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన సెల్‌ఫోన్లు, సమాచార వ్యవస్థ లేకపోవడం భద్రతా వ్యవస్థకు ఇబ్బందిగా మారుతున్న విషయాన్ని రాష్ట్రాలతో కేంద్రం జరిపిన ఇప్పటి చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో ఏకలవ్య విద్యాలయాలు, పోస్టు ఆఫీసులు ఏర్పాటు చేయడం గురించి దృష్టి సారిస్తారు. 
 
ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల పట్ల మరింత భాగస్వామ్యం చేయడం కీలకమని అభిప్రాయపడ్డారు.ఇప్పటికి దేశవ్యాప్తంగా మొత్తం 90 జిల్లాల్లో నక్సల్స్ సంబంధిత ఘటనలు జరుగుతున్నాయి. వీటిని భద్రతా సంబంధించిన వ్యయం (ఎస్‌ఆర్‌ఇ) పథకం పరిధిలోకి తీసుకువచ్చారు.