న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన మద్దతు పలికారు. తనతోపాటు కొత్తగా జడ్జీలుగా ప్రమాణం చేసిన 9 మందికి సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఇది మీ హక్కు. ఆ రిజర్వేషన్లను మీరు డిమాండ్ చేయాలి” అని రమణ వాళ్లకు సూచించారు. న్యాయవ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య అని తెలిపారు. న్యాయవ్యవస్థ కింది స్థాయిలో 30 శాతం కంటే తక్కువ మంది మహిళలు జడ్జీలుగా ఉన్నారని ఆయన చెప్పారు.
హైకోర్టులలో ఇది కేవలం 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రమే అని రమణ పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే.. కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రాల బార్ కౌన్సిల్స్‌లో వీళ్ల నుంచి రెండు శాతం మందే ప్రతినిధులుగా ఉన్నారని తెలిపారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదని రమణ ప్రశ్నించారు. ఈ అంశాలపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. ఇది అమెరికా సంస్కృతి అయినా.. కొన్ని మంచి విషయాలను ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకోవాలని రమణ పేర్కొన్నారు.
మహిళా న్యాయమూర్తులకు అసౌకర్యమైన పని పరిస్థితులు, వాష్‌రూమ్‌లు, తల్లులకు క్రెచెస్ వంటి మౌలిక సదుపాయాలు లేవని విచారం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తున్నానని చెప్పారు.
దసరా అనంతరమే కోర్టుల్లో ప్రత్యక్ష విచారణకు అనుమతిస్తామని వెల్లడించారు. కోర్టులు తెరవడం వల్లనే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వచ్చాయని ప్రజలు అనవచ్చని.. అందుకే థర్డ్ వేవ్, ఫోర్త్‌వేవ్‌లు రాకూడదని ఆశిద్దామని పేర్కొన్నారు. దసరా అనంతరం ప్రత్యక్ష విచారణకు అనుమతించవచ్చని చెప్పారు
More Stories
జార్ఖండ్ నుండి చొరబాటుదారులను తరిమికొడతాం
25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
యోగిని చంపివేస్తామని బెదిరింపు .. ఓ యువతి అరెస్ట్