రూ.700 కోట్ల కార్వీ షేర్లు ఫ్రీజ్‌

మ‌నీ లాండ‌రింగ్ కింద కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ‌కు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) జ‌ప్తు చేసింది. ఈ విష‌య‌మై ఈడీ కేసు న‌మోదు చేసింది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి త‌మ వ‌ద్ద తీసుకున్న రుణాల‌ను చెల్లించ‌లేదంటూ కార్వీ సంస్థ‌పై బ్యాంకులు చేసిన ఫిర్యాదు మేర‌కు హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల వ‌ద్ద ఇన్వెస్ట‌ర్ల షేర్ల‌ను తాక‌ట్టు పెట్టి కార్వీ సంస్థ రుణాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై బ్యాంకుల ఫిర్యాదు మేర‌కు హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీ చైర్మ‌న్ పార్ధ‌సార‌ధిని అరెస్ట్ చేసి విచారించారు. 

నాలుగు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్‌ చేసిన మెయిల్స్, పెన్‌డ్రైవ్‌లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్‌ చేసినట్టు తెలిసింది.

2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.  పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్‌ అయ్యారు. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్‌ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

ప్ర‌స్తుతం కార్వీ చైర్మ‌న్ పార్ధ‌సార‌ధి త‌దిత‌రులు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. పార్ధ‌సారధి క‌స్ట‌డీ కోసం మూడు రాష్ట్రాల పోలీసులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.