ఎల్‌ఐసీలో చైనా పెట్టుబడులకు భారత్ విముఖత

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జారీచేయనున్న మెగా ఐపీవోలో చైనా ఇన్వెస్టర్లను పెట్టుబడి పెట్టనీయకూడదని భారత్‌ భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఎల్‌ఐసీలో కొంత వాటాను విక్రయించడం ద్వారా రూ.90,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. 

దేశంలో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇదే కానుంది. ఈ ఐపీవోతో జారీ అయ్యే షేర్లలో 20 శాతం వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) పెట్టుబడి చేసేందుకు అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎల్‌ఐసీ షేర్ల కొనుగోలుకు చైనా ఇన్వెస్టర్లను మాత్రం అనుమతించకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టంలో మార్పులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.

చైనాతో తలెత్తిన సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఎల్‌ఐసీ వంటి కంపెనీల్లో ఆ దేశపు పెట్టుబడులు రిస్క్‌గా పరిణమిస్తాయని ఆ అధికారులు వివరించారు. గల్వాన్‌ లోయలో జరిగిన పోరు కారణంగా 118 చైనా యాప్స్‌ను భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.

“సరిహద్దుల ఘర్షణల తర్వాత ఇదివరకటి వలే చైనాతో వ్యాపారం చేయలేము. ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం. రెండు దేశాల మధ్య నమ్మకం అగాధం పెరిగిపోయింది” అని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సరిహద్దుల ఘర్షణ సమయం నుండి చైనా నుండి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అడ్డుకోవడానికి భారత్ పలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. 

చైనా నుండి వచ్చే ఇటువంటి పెట్టుబడులను చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేరుగా పర్యవేక్షిస్తూ ఉండడంతో, మన దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారంను నేరుగా చైనా ప్రభుత్వానికి చేరవేసే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకనే, అటువంటి పెట్టుబడులు మన దేశ భద్రతకు సమస్యలు తీసుకు రాగలవని భద్రతా వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 వాస్తవానికి ప్రస్తుత చట్టం ప్రకారం ఈ సంస్థలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడికి ఆమోదం లేదు. కానీ ఎఫ్‌ఐఐలు ఎల్‌ఐసీ ఐపీవోలో 20 శాతం వరకూ పెట్టుబడికి అనుమతించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే సమయంలో చైనా పెట్టుబడుల్ని నిషేధిస్తూ చట్టంలో కొన్ని క్లాజుల్ని పొందుపర్చాలన్న ప్రతిపాదన కేంద్రం ముందు ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా పెట్టుబడుల్ని ఎలా నియంత్రించాలన్న అంశమై ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదని, వివిధ ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.