వంట గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీకై కొత్త పధకం

వంట గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నది. దీని గురించి అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. పెరిగిన గ్యాస్‌ ధరల నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్‌ ధర వెయ్యికి చేరింది. దీంతో వినియోగదారులు ఈ ధరను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. 

ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్‌ ధర మరింత పెరిగే అవకాశమున్నదని తెలుస్తున్నది. దీని కోసం కొత్త పథకం ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ మేరకు రెండు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నది. ఇందులో మొదటి ప్రతిపాదన.. ఎలాంటి సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లను ఏ వినియోగదారుడికైనా అమ్మడం.

 రెండో ప్రతిపాదన.. ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం. ఈ మేరకు గ్యాస్‌ సబ్సిడీపై పరిమితులను కేంద్రం విధించవచ్చని చెబుతున్నారు. ప్రతిపాదిత కొత్త పథకం ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు, ఆపైగా ఉన్న కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వరు.

దీంతో అవసరమైన ప్రజలకే గ్యాస్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు కరోనా నేపథ్యంలో అంతర్జాతీయగా ముడి చమురు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం చాలా వరకు నిలిపివేసింది. గ్యాస్ రాయితీలను కూడా బాగా తగ్గించింది.

2020 ఆర్థిక ఏడాదిలో గ్యాస్‌ సిలిండర్లపై రూ.24,468 కోట్ల సబ్సిడీ ఇవ్వగా, 2021 ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ.3,559 కోట్లు మాత్రమే. కాగా, గ్యాస్‌ వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలోకి నేరుగా సబ్సిడీని జమ చేసే డీబీటీఎల్‌ పథకం నేపథ్యంలో 2020 ఆర్థిక ఏడాదిలో గ్యాస్ రాయితీ కోసం కేంద్రం సుమారు రూ.24,468 కోట్లు ఖర్చు చేసింది.

ఈ పథకం కింద వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌ రీఫిల్‌ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ అవుతుంది. అయితే, 2015 జనవరిలో ప్రారంభించిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తాత్కాలికంగా నిలిపింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ కోసం కొత్త పథకంపై కసరత్తు చేస్తున్నది.