గూగుల్ పై సీసీఐ దర్యాప్తు నిలిపివేతపై హైకోర్టు తిరస్కారం 

  • బెదిరింపులకు దిగుతున్న గూగుల్ 

సెర్చింజ‌న్ గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్ త‌గిలింది. గూగుల్‌పై కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద‌ర్యాప్తును నిలిపివేసేందుకు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వ‌డానికి ఢిల్లీ హైకోర్టు శుక్ర‌వారం నిరాక‌రించింది. భార‌త‌దేశంలో లావాదేవీలు జ‌రుపాలంటే దేశీయ చ‌ట్టాల‌ను తెలుసుకోవాల‌ని కాలిఫోర్నియాలో ఉన్న మీ క్ల‌యింట్‌కు స‌ల‌హా ఇవ్వండి అని గూగుల్ త‌ర‌ఫు న్యాయవాది అభిషేక్ మ‌ను సింఘ్వీకి జ‌స్టిస్ రేఖా ప‌ల్లి సూచించారు. 

గూగుల్ కాలిఫోర్నియా ఆఫీసు నుంచి సంస్థ సీనియ‌ర్ అధికారి ఒక‌రు సీసీఐ చైర్మ‌న్‌కు బెదిరింపు లేఖ రాశార‌ని న్యాయ‌స్థానం ముందు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎన్ వెంక‌ట్రామ‌న్ నివేదించడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. 

గూగుల్ వ్యాపార లావాదేవీలపై సీసీఐ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ద‌ర్యాప్తు నివేదిక బ‌హిర్గ‌తం చేసిన వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గూగుల్ ఆ లేఖ‌లో హెచ్చ‌రించింద‌ని వెంక‌ట్రామ‌న్ తెలిపారు. దీంతో భార‌త్ చ‌ట్టాల్లో ఏమున్న‌దో తెలుసుకోవాల‌ని గూగుల్ అధికారికి జ‌స్టిస్ రేఖాప‌ల్లి హిత‌వు చెప్పారు.

సెర్చింజ‌న్ గూగుల్ త‌మ‌పై బెదిరింపుల‌కు దిగుతున్న‌ద‌ని కాంపిటిష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆరోపించింది. గూగుల్ అనైతిక వ్యాపార ప‌ద్ద‌తులు పాటిస్తున్న‌ద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టినందుకు త‌మ‌ను గూగుల్ బెదిరిస్తున్న‌ద‌ని సీసీఐ పేర్కొంది. గూగుల్‌పై 2019లో సీసీఐ స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు ఆదేశించింద‌ని ప‌లు ప‌త్రిక‌ల్లో గ‌త‌వారం వార్త‌లు ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఆండ్రాయిడ్ సేవ‌ల్లో త‌న‌కు ఉన్న ఆధిప‌త్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిన‌ట్లు సీసీఐ ద‌ర్యాప్తులో తేలింద‌ని ఆ వార్తా ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. 
 
ప్లే స్టోర్‌, క్రోమ్ బ్రౌజ‌ర్‌, గూగుల్ సెర్చ్‌లో త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగించేందుకు కాంపిటీష‌న్ అండ్ ఇన్నోవేష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల నుంచి గూగుల్ త‌ప్పుకున్న‌ట్లు తేలింద‌ని ఆ వార్త‌ల సారాంశం.  ఇండియా కాంపిటీష‌న్ యాక్ట్‌లోని 4(2)(ఏ)ఐ, 4 (2) (బీ), 4 (2) (సీ), 4 (2) (డీ) సెక్ష‌న్ల‌ను గూగుల్ ఉల్లంఘించింద‌ని ఆ వార్త‌ల సారాంశం. 
 
దీంతో సీసీఐకి వ్య‌తిరేకంగా గురువారం ఢిల్లీ హైకోర్టులో గూగుల్ ఇండియా రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కాలిఫోర్నియా నుండి గూగుల్‌ సీనియర్‌ అధికారి నుండి సిసిఐ చైర్మన్‌కు బెదిరింపులు వచ్చాయని, తమపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని సిసిఐ కోర్టులో తెలిపింది. 
 
ఈ సమాచారాన్ని బయటకు వెల్లడిస్తే మీడియాను కూడా కోర్టుకు లాగుతామని బెదిరిస్తున్నారని స్పష్టం చేసింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే గూగుల్ ఇలా చేస్తోందని ఆరోపించింది. తమది ప్రభుత్వ సంస్థ అని, లీకైన రిపోర్టులో ఏముందని, మీడియా ద్వారా లీకైదంటూ భావిస్తున్న రహస్య సమాచారం ఏమిటనీ సిసిఐ ప్రశ్నించింది. 

విచారణలో పలుమార్లు గూగుల్‌ బెదిరించిందని, ఈ నేపథ్యంలో పిటిషన్‌ను రద్దు చేయాలని పేర్కొంది. వచ్చే 10 రోజుల్లో కాన్ఫిడెన్షియల్‌, నాన్‌ కాన్ఫిడెన్షియల్‌ నివేదికలు సిద్ధం కానున్నాయని, వారికి ఓ కాపీ అందించి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని, అదే వాస్తవ న్యాయ ప్రక్రియ అని స్పష్టం చేసింది. సహజ న్యాయ పక్రియకు విరుద్ధంగా గూగుల్‌ స్టే అడుగుతుందని సిసిఐ కోర్టుకు వెల్లడించింది.