జియోమార్ట్‌ కు శ్రీవారి ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌

జియోమార్ట్‌ కు శ్రీవారి ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌

టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. దర్శన టికెట్ల కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత ‘జియోమార్ట్‌’ సబ్‌డొమైన్‌లోకి వెళ్లడంపై నెటిజన్లు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. శ్రీవారి వెబ్‌సైట్‌ను కూడా అమ్మేశారా అంటూ టీటీడీ అధికారులపై విరుచుకుపడ్డారు.

శ్రీవారి ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ ప్రక్రియను అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్‌ సంస్థకు చెందిన ‘జియోమార్ట్‌’కు టిటిడి అవకాశం అప్పగించింది. రూ.300 దర్శనం టికెట్ల కోసం భక్తులు ఇకపై జియోమార్ట్‌ను ఆశ్రయించాల్సిందే. టిటిడి లాంటి ప్రముఖ ధార్మిక సంస్థలో సొంత వెబ్‌సైట్‌ను నిర్వహించుకోలేక ‘జియోమార్ట్‌’ సర్వర్‌ను తీసుకొచ్చి భక్తుల పత్రాలన్నీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచేలా చేయడం పట్ల పలు విమర్శలు చెలరేగుతున్నాయి. .

 టికెట్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టగానే విపరీతమైన హిట్లు రావడం వల్ల సర్వర్లు క్రాష్‌ అవుతున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు క్లౌడ్‌ సర్వర్లు కలిగిన పెద్ద సంస్థలను ఆశ్రయించాల్సి వచ్చిందని టిటిడి అదనపు ఇఒ ఎ.వి.ధర్మారెడ్డి చెప్తున్నారు. జియో సర్వీసుకు ఒక్క రూపాయి కూడా టిటిడి చెల్లించడం లేదని వివరణ ఇచ్చారు. 

అయితే, శతాధిక కోట్లు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా ‘సాఫ్ట్‌వేర్‌’ను రూపొందించుకోవాల్సింది పోయి ‘కార్పొరేట్ల’కు రెడ్‌ కార్పెట్‌ పరవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  కోవిడ్‌ మహమ్మారి వల్ల తిరుమల వెంకన్న దర్శనం కోసం ముందుగా టికెట్లు రిజర్వు చేసుకునే భక్తులకే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. 

గత ఏడాది జూన్‌ నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. అలిపిరి వద్ద టికెట్లను చూపించిన వారికి మాత్రమే ముందుకెళ్లే అవకాశం వస్తోంది. సర్వదర్శనం కూడా పూర్తిగా ప్రారంభించక పోవడంతో నేటికీ ఎక్కువమంది రూ.300 దర్శనం టికెట్లను తీసుకుని దర్శనాలకు వస్తున్నారు. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లోనే రిజర్వు చేసుకోవాల్సి ఉంటోంది. 

శుక్ర, శనివారాల్లో ఆన్‌లైన్‌ టికెట్ల బుకింగ్‌ ఉంటుందని టిటిడి ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల వారు దర్శనం టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నాలు చేశారు. శుక్రవారం టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్‌ బుకింగ్‌కు ప్రయత్నించిన చాలామందికి నిరాశే ఎదురైంది. 

టిటిడి ఆన్‌లైన్‌ టికెట్ల వెబ్‌సైట్‌ జియోమార్ట్‌ వెబ్‌సైట్‌కు రీడైరెక్టు అవుతోందని పలువురు భక్తులు చెప్పారు. మధ్యాహ్నానికి టిటిడి దీనిపై స్పందించి జియో సర్వీసు ప్రొవైడర్‌గా వ్యవహరిస్తోందని, ప్రస్తుతానికి తిరుపతి బాలాజీ.ఎపి,జిఒవి.ఇన్‌ లేదా తిరుపతి బాలాజీ.జియోమార్ట్‌.కామ్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. 

సాంకేతిక మార్పులకు సమయం తక్కువ కావడంతో తిరుపతి బాలాజీ పేరుతో సబ్‌డొమైన్‌ తీసుకురావడం కుదరక, టిటిడి అఫిషియల్‌ వెబ్‌సైట్‌ను ల్యాండింగ్‌ పేజీగా వాడుతూ జియోమార్ట్‌ సబ్‌డొమైన్‌కి రూట్‌ చేసినట్లు చెప్పారు. ఈసారి టికెట్లు విడుదల చేసే సమయానికి ఈ సబ్‌డొమైన్‌ కూడా తిరుపతి బాలాజీ పేరుతో ఉండబోతుందని తెలిపారు. 

టిటిడికి చెందిన ప్రభుత్వ వెబ్‌ సైట్‌ ఉండగా జియో మార్ట్‌ అంటూ దర్శనం కోసం వచ్చే వారి వివరాలు సేకరించే ప్రయత్నం జరగడం పలు సందేహాలకు తావిస్తోంది.దీంతో ‘టీటీడీ వెబ్‌సైట్‌ని కూడా అంబానీకి అమ్మేశారా?, టీటీడీకి, జియోమార్ట్‌కు సంబంధం ఏంటి? టీటీడీ వెబ్‌సైట్‌ను అంబానీకి కట్టబెట్టిన జగన్‌ ప్రభుత్వం’ అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.