అంత్యోదయ నమూనా ప్రదాత పండిట్ దీనదయాళ్

అంత్యోదయ నమూనా ప్రదాత పండిట్ దీనదయాళ్

* 105వ జయంతి నివాళి 

చలసాని నరేంద్ర 

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆధునిక కాలంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయ రాజకీయ తాత్విక ఆలోచనాపరులలో ఒకరు. ఆయన బహుశా ఏకైక భారతీయ రాజకీయ తత్వవేత్త. విస్తారమైన భారతీయ సంస్కృతి, ప్రాచీన భారతీయ విజ్ఞాన సంప్రదాయంల అపారమైన మూలాల నుండి తన ఆలోచనా సిద్ధాంతాలన్నింటినీ రూపొందించారు.

1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లో మధురకు సమీపంలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి, 8 వ ఏటనే తల్లితండ్రులను కోల్పోయి, మేనమామ పెంపకంలో పెరిగిన ఆయన భారతీయ జనసంఘ్ ను డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ నుండి సహాయకులుగా వచ్చిన నలుగురైదుగురులలో ఒకరు.

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నా యంగా నూతన రాజకీయ పార్టీని స్థాపించిన డా. ముఖర్జీ కొద్ది కాలంలోనే మృతి చెందడంతో దానికి నిర్దిష్టమైన సైద్ధాంతిక భూమికను ఏర్పా టు చేయలేకపోయారు. బలరాజ్ మధోక్ జనసంఘ్‌కు రాజకీయ, ఆర్ధిక విధానాలు రూపొందించగలిగినా సంస్థాగతంగా దానికి ఒక స్వరూపం తీసుకురావడంతో పాటు, సైద్ధాంతిక భూమిక ఏర్పాటు చేసింది ఉపాధ్యాయ మాత్రమే. నేటి భారతీయ జనతా పార్టీ సహితం ఆ భూమిక నుండే స్ఫూర్తి పొందుతున్నది.

మొత్తం ప్రపంచం పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజంల మధ్య విడిపోతున్న సమయం లో ఆ రెండింటి ప్రాతిపదిక ఒక్కటే అని, వాటికి భిన్నంగా సాధారణ ప్రజలు కేంద్రంగా విధానాలు రూపొందించాలని అంత్యోదయ అభివృద్ధి నమూనాను దీనదయాళ్ ప్రతిపాదించారు. అదే తర్వాతి క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల పట్ల దృష్టి సారించేందుకు దారితీసింది.

అప్పటి వరకు పాలకులు కేవలం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు పట్లనే దృష్టి సారించేవారు. ‘గరీబీ హటావో’ అంటూ ఇందిరా గాంధీ పేదల అభ్యున్నతి గురించి ప్రస్తావించడానికి చాలా ముందుగానే దీనదయాళ్ ‘అంత్యోదయ’ కల్పనను మన ముందుంచారు. అభివృద్ధి ఫలాలు మొదటగా అట్టడుగున ఉన్న వారికి చేరాలన్నదే ఆయన సంకల్పం.

మధ్యప్రదేశ్‌లో వి కె సకలేచ, రాజస్థాన్‌లో భైరంగసింగ్ షెకావత్, హిమాచల్ ప్రదేశ్‌లో శాంత కుమార్ వంటి వారు అంత్యోదయ అభివృద్ధి నమూనాను దీనదయాళ్ స్ఫూర్తితో అమలు ప్రారంభించారు. అయితే ఆ తర్వాత పేదల ఓట్లు రాబట్టే ప్రజాకర్షణ పథకాలుగా మారిపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. రూ. 2 కు కిలో బియ్యం, శాశ్వత గృహనిర్మాణం, పెన్షన్లు వంటివి అటువంటివే.

పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజం రెండింటి తిరస్కరిస్తూ ఆయన ఏకాత్మ మానవతావాదం అనే తాత్విక సిద్ధాంతాన్ని భారత రాజకీయాలకు ప్రత్యామ్నాయ సైద్ధాంతిక ప్రాతిపదికగా ప్రతిపాదించారు. 1964లో ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదంను మరుసటి సంవత్సరం జనవరి చివరిలో విజయవాడలో జరిగిన జనసంఘ్ మహాసభలు ఆమోదించాయి.

ఏప్రిల్, 1965లో ముంబైలో నాలుగు ప్రసంగాలలో తన సైద్ధాంతిక భూమికకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. నాడు ప్రపంచ దేశాల ముందున్న వివిధ రాజకీయ విధానాలకు పూర్తిగా భిన్నమైన, విలక్షణమైన భారతీయ ప్రత్యామ్నాయంగా అపారమైన హేతుబద్ధమైన నేపథ్యాన్ని కల్పించారు. ఆయన భవిష్యత్ అవకాశాలపై దృష్టి సారించి సమకాలీన సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రాచీన మూలాల ఆధారంగా ఆలోచనను ప్రతిపాదించారు. దీనదయాళ్ ప్రతిపాదించిన పరిపాలన, రాజకీయాల ప్రత్యామ్నాయ విధానాలు నేడు ప్రపంచంలో అనేక మంది ఆలోచనాపరుల దృష్టిని ఆకట్టుకొంటున్నాయి.

అయితే తర్వాత కొద్ది కాలంకే అనుమానాస్పద పరిస్థితులలో 11 ఫిబ్రవరి 1968 న మొఘల్ సరాయ్ రైల్వే యార్డ్ వద్ద చనిపోవడంతో ఆయన ఆలోచనలకు నిర్దుష్టమైన కార్యప్రణాళికలను రూపొందించలేకపోయారు. పాశ్చాత్య రాజకీయ ఆలోచన వాదనలను తిరస్కరించిన ఆయన వారి ఆలోచనలను పూర్తిగా తృణీకరించలేదు.

పాశ్చాత్య ఆలోచనలకు సంబంధించి, వారి సైన్స్, జీవన విధానంలను రెండు భిన్నమైన అంశాలుగా పరిగణించాలని సూచించారు. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం సార్వత్రికమైనదని, మనమంతా ప్రగతి సాధించాలంటే అనుసరింపవలసిందే అని స్పష్టం చేశారు. అయితే పాశ్చాత్య జీవన విధానాలు, విలువల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

పేదరికంలో కూడా అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణత అవుతూ వస్తున్న ఆయనకు పిలానీలో బిఎ (ఆంగ్ల సాహిత్యం) చదువుతున్న సమయంలో స్నేహితుడు బలవంత మహాశబ్దే ప్రోత్సాహంతో 1937లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరమని మేనమామ పట్టుబట్టినా, సమాజ కార్యం కోసం తన జీవితం అంకితం చేయాలనే పట్టుదలతో 1942లో ఆర్‌ఎస్‌ఎస్ పూర్తి సమయ కార్యకర్త ‘ప్రచారక్’ గా వచ్చారు.

గురూజీగా ప్రసిద్ధి చెందిన నాటి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ ఆయనను ఉద్దేశించి ‘ఆదర్శ స్వయంసేవక్’ అంటూ ఉండేవారు. దీనదయాళ్ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అసాధారణమైన, విజయవంతమైన సంఘటనా కార్యక్రమం చేసేవారు. ప్రజలను కలిసి ఉంచడంలో నేర్పును ప్రదర్శించేవారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ విస్తరించడంతో ఆయన పాత్ర చాల ముఖ్యమైనది’ అని ఆయనతో పాటు జనసంఘ్‌లో ప్రారంభం నుండి పని చేసిన నానాజీ దేశ్ ముఖ్ పేర్కొన్నారు.

1945లో హిందూత్వ జాతీయవాదం భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, లక్నోలో రాష్ట్ర ధర్మ ప్రకాశన్ ఏర్పాటు చేసి, దాని ఆధ్వర్యంలో రాష్ట్ర ధర్మ మాస పత్రికను ప్రారంభించారు. 1948లో, పాంచజన్య వార పత్రికను, 1949 లో తరుణ్ భారత్ దినపత్రికను ప్రారంభించారు. 1946, 1947లలో ఆయన రాసిన గ్రంథాలు సామ్రాట్ చంద్రగుప్త, జగద్గురు శంకరాచార్య విశేషంగా ప్రసిద్ధి చెందాయి.

1951 అక్టోబర్ 21న ఢిల్లీలో జరిగిన అఖిల భారత సదస్సులో డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడిన భారతీయ జనసంఘ్‌కు దీనదయాళ్ తొలి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ తొలి జాతీయ మహాసభలు ఆయన ఆధ్వర్యంలో 1952 డిసెంబర్ 29 -31 లలో కాన్పూర్ లో జరిగాయి.

రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోయినా గురూజీ ప్రోద్బలంతో చేరి, జనసంఘ్ జాతీయ పార్టీగా, ఓ బలమైన రాజకీయ శక్తిగా విస్తరించడానికి, విలక్షణమైన తాత్విక సైద్ధాంతిక భూమికను ఆ పార్టీకి ఏర్పర్చడానికి దీనదయాళ్ విశేషంగా కృషి చేశారు. 1967 వరకు జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా 15 ఏళ్ల పాటు కొనసాగిన ఆయన కాలికట్‌లో జరిగిన డిసెంబర్ చివరిలో జరిగిన పార్టీ మహాసభలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే ఆ పదవిలో 43 రోజులు మాత్రమే కొనసాగి, అకాల మరణానికి గురయ్యారు.

దీనదయాళ్ ఆలోచనలను వాస్తవ రూపానికి మార్చాలని విశ్వసించారు. ‘ఈ దేశం కోసం ఒక గొప్ప భవిష్యత్తు మన కళ్ల ముందు ఉంది; మనం కేవలం దార్శనికులం కాదు, కర్మయోగులం. మన దృష్టిని వాస్తవంలోకి అనువదించడానికి నిశ్చయించుకున్నాము’ అంటూ స్పష్టం చేశారు.

దీనదయాళ్ ఉపాధ్యాయ గురించి ఆలోచించడం తప్పనిసరిగా స్వాతంత్య్రానంతర పరిస్థితులలో భవిష్యత్తు భారతదేశాన్ని దృశ్యమానం చేయడానికి సమగ్ర, బహుళ- పరిమాణ ప్రయత్నాల అంతరాన్ని పూరిస్తుంది. దీనదయాళ్ ఉపాధ్యాయ ఆధ్యాత్మికత, నైతికత, ప్రజాస్వామ్యం వంటి ఆధునిక సాధనాలతో విభిన్న ఆలోచనల ఆమోదయోగ్యమైన సాంస్కృతిక, నైతిక సాంప్రదాయాన్ని సమకాలీకరించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు.

ఒక లక్ష్యం, ఒక ఆదర్శం, ఒక నిర్దిష్ట భూమిని మాతృభూమిగా చూసిన ‘ప్రజల సమూహం’ ఒక దేశంగా ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఒక ఆదర్శం, మాతృభూమి లలో ఏదొక్కటీ లేకపోయినా అది దేశం కాలేదని తేల్చి చెప్పారు. ‘భారత్ అనే పేరు ఒక భూభాగం గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది, కానీ ‘భారత మాత’ అనెడిది భూమి, నివాసితుల మధ్య సంబంధాన్ని ఏర్పరుచుకునే ప్రత్యేక, ఏకీకృత స్పృహను రేకెత్తిస్తుంది. ఈ సందర్భంలో, మాతృభూమి లేదా జన్మభూమి అనే ఆలోచన భారతదేశంలో సాంస్కృతిక ప్రత్యేకమైనది’ అంటూ ఆయన వివరించారు.

(మన తెలంగాణ నుండి)