త్వ‌ర‌లో నూత‌న స‌హ‌కార విధానం

కొత్తగా సృష్టించబడిన సహకార మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిస్తూ, 2021-22లో ప్రభుత్వం త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ స‌హ‌కార స‌ద‌స్సును ఉద్దేశించి అమిత్ షా ప్ర‌సంగీస్తూ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల వేళ నూత‌న స‌హ‌కార విధానాన్ని తీసుకువ‌స్తున్నామ‌ని, ఇది గ్రామీణ స‌మాజాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

ఈరోజు దేశంలో 91 శాతం గ్రామాల్లో స‌హ‌కార సంస్ధ‌లు ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు ఎదిగేందుకు స‌హ‌కార వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో స‌హ‌కార మంత్రిత్వ శాఖ అద్భుత సామ‌ర్ధ్యంతో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కేంద్ర మంత్రి చెప్పారు.

జాతీయ సహకార సదస్సులో మాట్లాడుతూ “ఇది భారతదేశానికి 75 వ స్వాతంత్య్ర సంవత్సరం, అమృత్ మహోత్సవంలో భాగంగా, మనం  కొత్త సహకార విధానాన్ని రూపొందించడంతో ప్రారంభిస్తాము” అని వెల్లడించారు. సహకార సంఘాలపై ప్రస్తుతం ఉన్న జాతీయ విధానాన్ని అప్పటి వాజపేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మార్చి 2002 లో ప్రవేశపెట్టింది.
జూలై 6 2021 న సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత జరిగిన ఈ అతిపెద్ద సహకార సదస్సును ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కో), నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అముల్, సహకార భారతి, నాఫెడ్, క్రిబ్కో లతో సహా వివిధ సహకార సంస్థలు కలసి నిర్వహించాయి. 

బహుళ రాష్ట్ర సహకార సంఘాల పనితీరును సులభతరం చేయడానికి మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీల చట్టం, 2002 ను కేంద్రం త్వరలో సవరించనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ఆరు లక్షల గ్రామాల అవసరాలను తీర్చడానికి 63,000 ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు (పాక్స్) సరిపోవని ఆయన స్పష్టం చేశారు. 
 
“రాబోయే ఐదేళ్లలో ప్రతి రెండవ గ్రామంలో పాక్స్ ను స్థాపించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం. వీటి సంఖ్యను 65,000 నుండి 3 లక్షలకు పెంచడానికి, సహకార మంత్రిత్వ శాఖ సరైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తుంది. మేము దానిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాము. రాష్ట్రాలు తమ చట్టాలలో ఆ మేరకు మార్పులు చేయవచ్చు” అని వివరించారు.

సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేస్తూ సహకారం రాష్ట్ర ప్రభుత్వాల అంశం అని చాలామంది అంటుంటారని గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో కేంద్రం – రాష్ట్రాల మధ్య వివాదాలకు దిగేందుకు ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. 


మోదీజీ నాయకత్వంలో ఏర్పడిన సహకార మంత్రిత్వ శాఖ ఎవరితోనూ పోరాడటానికి ఉద్దేశింపలేదని చెబుతూ అన్ని రాష్ట్రాలకు సహకరించడానికి మాత్రమే అని భరోసా ఇచ్చారు. ఇది కేంద్ర అంశమా, రాష్ట్రాల అంశమా  అని ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించారు. 
 “మనం అందరికీ సహాయం చేయవచ్చు; మేము రాష్ట్రాలకు కూడా సహాయం చేస్తాము. మేము అందరిని వెంట తీసుకెళ్తాము. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతాము, ”అని అమిత్ షా భరోసా ఇచ్చారు.