అస్సాం హింసాకాండ వెనుక అతివాద ఇస్లామిక్ గ్రూప్ పీఎఫ్ఐ

అస్సాంలోని డరంగ్ జిల్లాలో గత వారం జరిగిన హింసాకాండ వెనుక అతివాద ఇస్లామిక్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ సంఘటనలో మతపరమైన కోణం ఉందనడాన్ని తోసిపుచ్చారు. 

ఈ సందర్భంగా పోలీసు కాల్పులపై ప్రసారమవుతున్న వీడియోలు పూర్తి విషయాలను వెల్లడించడం లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. డరంగ్ జిల్లాలో గత గురువారం ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల కాల్పుల్లో పన్నెండేళ్ళ బాలుడు సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది పోలీసులు, ఆరుగురు సాధారణ పౌరులు గాయపడ్డారు.

ఆక్రమణల నుంచి ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని కొందరు వ్యక్తులు కొద్ది నెలల క్రితం స్థానిక పేదల నుంచి రూ.28 లక్షలు వసూలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా డబ్బు వసూలు చేసినవారి పేర్లు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఆక్రమణల తొలగింపును నిరోధించ లేకపోవడంతో వారు స్థానికులను రెచ్చగొట్టారని ఆయన చెప్పారు.

ఈ సంఘటన గురువారం జరిగిందని, అంతకుముందు రోజు పీఎఫ్ఐ ఈ ప్రదేశానికి వచ్చిందని చెప్పారు. నిర్వాసితులకు ఆహారం ఇస్తామనే నెపంతో పీఎఫ్ఐ వ్యక్తులు వచ్చారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తుల ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభిస్తున్నాయని చెప్పారు. వీరిలో ఓ కళాశాల లెక్చరర్ కూడా ఉన్నట్లు తెలిపారు. 

పీఎఫ్ఐపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని శర్మ వెల్లడించారు. ఇదిలావుండగా ఈ సంఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గువాహటి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. అయితే రిటైర్డ్ జడ్జి పేరును ప్రకటించవలసి ఉంది.

ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ తో తాను అనేక సమావేశాలు జరిపానని, వారు ఆక్రమణల తొలగింపుకు అంగీకరించారని శర్మ చెప్పారు. “ప్రజలు భూమిలేనివారు అయితే, వారికి రెండు ఎకరాలు లభిస్తుందని నేను చెప్పాను. ఒకే విషయం ఏమిటంటే, వారికి వేరే చోట భూమి ఉండకూడదు. కానీ చాలా మందికి భూమి ఉంది.  జాతీయ మీడియాలో చిత్రీకరించినట్లుగా వారు భూమిలేని వారు కాదు.   బాగ్‌బోర్ (బార్‌పేట) వంటి పూర్వీకుల గ్రామాలలో వారి భూమి ఉంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

దిగువ అస్సాంలోని బార్‌పేటలో బెంగాలీ మాట్లాడే ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు ఎక్కువగా జరగడంతో ప్రస్తుత రసభ జరుగుతున్నది. తనను కలవడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా ఇదే విషయాన్ని వివరించానని ఆయన చెప్పారు. “భూ నిర్వాసితులను పరిష్కరించడానికి ప్రభుత్వం మొదటిసారిగా ఒక వైఖరిని తీసుకుందని వారు అంగీకరించారు.  ఆ తర్వాత వారు అల్లకల్లోలం సృష్టించారు” అని సిఎం ఆరోపించారు.