ఉఫ్‌మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిది

ఉఫ్‌మని ఊదితే కొట్టుకుపోయే ప్రభుత్వమిదని కేసీఆర్ ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీకి భయపడి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమని, ఇకపై కేసులు పెడితే తానే నేరుగా పోలీస్‌స్టేషన్లకు వస్తానని హెచ్చరించారు. సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర గురువారం 27వ రోజు సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించింది.
ఈ సందర్భంగా గంభీరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తానే పోలీస్ స్టేషన్ల  వద్దకు వస్తే అప్పుడు అక్కడికి ఏకంగా సీఎం రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక సర్పంచులు ఆత్మహత్య లకు పాల్పడే పరిస్థితి తలెత్తిందని సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల  మాఫియాకు అడ్డాగా మారుతోందని సంజయ్ ఆరోపించారు. ఏడున్నరేళ్లలో మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లకు ఏం చేశారని ప్రశ్నించారు. గట్టిగా వర్షం పడితే సిరిసిల్ల మునిగిపోతుందని చెబుతూ సిరిసిల్లను ఎంత అభివృద్ధి చేశాడో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెప్పాలని నిలదీశారు.
కేంద్రం ఇచ్చిన నిధులతో వైకుంఠదామాలు నిర్మించి పింక్ కలర్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు నిధులివ్వడం లేదు. సర్పంచ్‎లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేరుకు మాత్రమే ఎంపీటీసీలు. వారికి ఎటువంటి అధికారాలు లేవని దుయ్యబట్టారు.
వరి వేస్తే ఉరే అని ఏ ముఖ్యమంత్రి అయినా అంటాడా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. “పంట మార్పిడి నేను వ్యతిరేకిస్త లేను. భూసార పరీక్షలు నిర్వహించి.. పంట మార్పిడి చేయాలి. కేంద్రం వరి కొంటలేదని అంటున్నారు. ప్రతి గింజా కొంటామని అన్నావ్ కదా మరి ఏమైంది?” అంటూ ప్రశ్నించారు. కేంద్రం కొనేది బియ్యం. రాష్ట్రాలు కొనాల్సింది వడ్లు. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోం అని స్పష్టం చేశారు.
దళితబంధు సిరిసిల్లలో ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి నియోజకవర్గనికి ఇవ్వాలి. ఇవ్వకపోతే బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అక్టోబర్‎లో ఉద్యమాలు చేపడుతాం అని స్పష్టం చేశారు. అన్ని విషయాల్లో పైసలు కేంద్రానివి.. ప్రచారం మాత్రం కేసీఆర్‌ చేసుకుంటారని ధ్వజమెత్తారు. మాట్లాడితే పెట్రోలు చార్జీలు పెంచామంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.40 వివిధ పన్నుల కింద తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు.
ఇదే అదనుగా ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు పెంచాలని చూస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.  రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందేనని సంజయ్‌ డిమాండ్‌ చేశారు, ఇందుకోసం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామని వెల్లడించారు.