జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపై వారెంట్

జగన్‌ అక్రమాస్తుల కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. నాంపల్లిలోని ఈడీ, సీబీఐ స్పెషల్‌ కోర్టులో గురువారం ఈ కేసు విచారణ జరిగింది. దాల్మియా సిమెంట్స్‌ కేసులో విచారణకు తరచూ హాజరు కాకపోవడంతో ఆమెపై ఎన్‌బీడబ్ల్యూ జారీచేసింది. 

ఇక రాంకీ కేసులో విశ్రాంత ఐఏఎస్‌ జి.వెంకట్రామిరెడ్డి కోర్టుకు హాజరై, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రత్యక్ష విచారణకు రాలేకపోయాయని విజ్ఞప్తి చేశారు. తనపై ఇదివరకు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఆయనపై జారీచేసిన వారెంట్‌ను కోర్టు రద్దు (ఎన్‌బీడబ్ల్యూ రీకాల్‌) చేసింది. 

కాగా, వాన్‌పిక్‌ కేసు విచారణకు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి హాజరు కాలేదు. విచారణకు హాజరు కాకుంటే వారిద్దరిపై తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణను 30కి వాయిదా వేసింది. కాగా, అక్రమాస్తుల కేసుల్లో జగన్‌, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కావాలని నాంపల్లి కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో వాన్‌పిక్‌, జగతి పబ్లికేషన్స్‌, పెన్నా సిమెంట్స్‌ కేసుల విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 30కి వాయిదా వేసింది.

మరోవంక, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌ కేసులో ఏ6గా ఉన్న శ్రీలక్ష్మి.. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని గతేడాది హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు వెలువరించింది. 

నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్‌ లీజు ఇచ్చారని, నిందితులతో కుమ్మక్కవడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించారన్న తీవ్ర అభియోగాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అంతకుముందు పిటిషనర్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేస్తున్నట్లు స్పష్టం చేసింది.