ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉండేందుకు ప్రణాళిక అవసరం 

పేదలు, బలహీనులపై కరోనా మహమ్మారి భారీగా ప్రభావం చూపిందని పేర్కొంటూ దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా, మెరుగ్గా ఉండేందుకు ప్రణాళిక అవసరమని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 

48వ ఎఐఎంఎ నేషనల్ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అవసరానికి మద్దతుగా భారతదేశం ఎకానమీలో కూడా వేగంగా మార్పు వచ్చిందని తెలిపారు. 

అయితే వేర్వేరు రంగాల్లో రికవరీ అసమానంగా ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారడం వంటి అనేక నిర్మాణాత్మక మార్పులు వచ్చాయని, ప్రయాణ సమయం తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేలా సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేసిందని తెలిపారు. 

తక్కువ నైపుణ్యం కల్గిన కార్మికులు, కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగంలోని వారికి ఆటోమేషన్, రోబోటిక్ ముప్పులా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ విధానంలోకి మారడం కొత్త అవకాశాలను సృష్టించింది. ప్రయాణం, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ఉపాధి రంగాలకు సవాళ్లు ఎదురయ్యాయి. వినియోగ విధానంలో మార్పులు, డిమాండ్ తగిన విధంగా కంపెనీల సరఫరా వంటివి వచ్చాయని వివరించారు. 

వృద్ధి విషయానికొస్తే, కార్పొరేట్ బాండ్ల ద్వారా ఎన్‌బిఎఫ్‌సి, ఎంఎఫ్‌ల ఫండింగ్ పెరిగింది. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమర్ ట్రబుల్‌షూటింగ్, డేటా అనలిటిక్స్, పని ప్రదేశం మార్పు, సప్లై చైన్ ఆటోమేషన్, 5జి మోడర్నైజేషన్, సైబర్ సెక్యూరిటీ సామర్థాలు వంటి ప్రాంతాల్లో పటిష్టమైన డిమాండ్ కొనసాగే అవకాశమందని ఆయన వివరించారు.

తయారీ రంగానికి ఊతమందించేందుకు ప్రభుత్వం తీసుకున్న పిఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత రాయితీ) పథకం కీలకమైన చర్య అని దాస్ పేర్కొన్నారు. పలు రంగాలకు పిఎల్‌ఐ పథకం అవసరం, కంపెనీలు సామర్థాన్ని మరింత పెంచుకునేందుకు పిఎల్‌ఐ పథకం ఎంతగానో దోహదం చేయనుందని చెప్పారు. 

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల తయారీ రంగం బలోపేతం అవతుందని దాస్ పేర్కొన్నారు. ఫిన్‌టెక్, ఎడ్‌టెక్ కంపెనీల్లో నిధుల ప్రభావం పెరిగింది. వేగంగా వృద్ధిని సాధిస్తున్న మరో రంగం ఇకామర్స్ అని తెలిపారు.