పెట్టుబడిదారుల కోసం జాతీయ సింగిల్‌ విండో

వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, క్లియరెన్సుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌)ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం ప్రారంభించారు. ఈ వేదిక అనుమతుల కోసం ఇన్వెస్టర్లకు ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక్కచోటే అన్ని క్లియరెన్స్‌లు లభించే వెసులుబాటు కల్పిస్తుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌ ఇన్వెస్టర్లకు అనుమతుల విషయంలో భారీ ఊరట కల్పిస్తుందని అన్నారు. ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌తో భారత్‌లో సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇప్పటివరకూ తొమ్మిది రాష్ట్రాలు, 18 ప్రభుత్వ విభాగాలు ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌లో చేరాయి. మరో 14 శాఖలు, 5 రాష్ట్రాలు ఇందులో చేరతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌ ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని, సింగిల్‌ డ్యాష్‌బోర్డుపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

అనుమతులకు దరఖాస్తు చేసుకోవడం, ట్రాక్‌ చేయడం, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా అప్లికెంట్‌ డ్యాష్‌బోర్డు కూడా ఈ పోర్టల్‌లో ఉంటుందని వివరించారు.