11వ మహారత్నగా పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పిఎఫ్‌సిఎల్‌) 11వ మహారత్నగా మారనుంది. ఈ మేరకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ కమిటీ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. గత వారం సమావేశం అయిన ఈ కమిటీ పిఎఫ్‌సికి మహారాత్న హోదా ఇచ్చేందుకు ఆమోదించిందని అందులోని సభ్యులు తెలిపారు.

 పిఎఫ్‌సిఎల్‌, ఆర్‌ఇసి లిమిటెడ్‌ వంటి విద్యుత్‌ రంగ రుణ దాతలను రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ పంపిణీ కంపెనీలు (డిస్కాం)లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. మహారత్న హోదా పొందిన తరువాత విలీనాలు, కొనుగోళ్లు జరుగుతాయి. 

పిఎఫ్‌సిఎల్‌ దేశంలో అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి), 14 నవరత్న సిపిఎస్‌ఇలు సాధారణ ప్రభుత్వ కార్యాచరణ విధుల నిర్వహించడంతో పాటు ఒక్కో ప్రాజెక్టులో రూ. 5,000 కోట్ల వరకు లేదా, దాని నికర విలువలో 15 శాతం వరకు పెట్టుబడి పెట్టే వీలుంది. 

నవరత్న, మినీరత్న సిపిఎస్‌ఇలు వరుసగా రూ.1,000 కోట్లు, రూ. 500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చని కేంద్రం తెలిపింది. పిఎఫ్‌సిఎల్‌కు మహారత్న హోదాకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ దాదాపు 10 రోజుల్లో జారీ చేయవచ్చునని ఇంటర్‌ మిని స్ట్రీయల్‌ సభ్యులు ఒకరు తెలిపారు.

సిపిఎస్‌ఇ నవరత్న హోదా పొందాలంటే ఆ సంస్థ భారతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో జాబితా అవ్వాలి. అలాగే సగటు వార్షిక టర్నోవర్‌ రూ.25,000 కోట్లు, నికర లాభం రూ. 5,000 కోట్లు కలిగి ఉండాలి. అలా మూడేళ్ల పాటు ఉంటే, దానికి మహారత్న హోదా ఇస్తారు.

జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికంలో పిఎఫ్‌సిఎల్‌ నికర లాభంలో 34 శాతం పెరుగుదల సాధించి రూ.2,274 కోట్లకు చేరింది. త్రైవాసికంలో ఆర్‌ఇసి లిమిటెడ్‌ తన నికర లాభంలో 22 శాతం పెరుగుదలతో రూ.2,247 కోట్లకు నమోదు చేసుకుంది. భారత్ లో ప్రస్తుతం 10 మహారత్న సిపిఎస్‌ఇలు, 14 నవరత్నాలు, 73 మినీరత్న సిపిఎస్‌ఇలు ఉన్నాయి.

దేశంలో ప్రస్తుత మహారత్నలు:  భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎన్‌టిపిసి లిమిటెడ్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.