పిల్లల కొవాగ్జిన్ ట్రయల్స్ వచ్చే నెలకు పూర్తి

18 ఏళ్ల లోపు పిల్లలకు ఉపయోగించే కొవాగ్జిన్ వ్యాక్సిన్ 2/3 ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. ఈ ట్రయల్స్ డేటా భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) కి వచ్చేవారం సమర్పించనున్నట్టు భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణా ఎల్లా వెల్లడించారు. 
 
కొవాగ్జిన్ ఉత్పత్తి సెప్టెంబర్‌లో 3.5 కోట్ల డోసులు ఉండగా, అక్టోబర్ నాటికి 5.5 కోట్ల డోసులకు చేరుతుందని చెప్పారు. ఒక వేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమౌతుందని చెప్పారు. ఈ ట్రయల్స్ వెయ్యిమంది వాలంటీర్లపై జరిగినట్టు చెప్పారు. 
 
ముక్కు ద్వారా ఇచ్చే ఈ నాసికా వ్యాక్సిన్ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వైరస్‌కు ప్రవేశ ద్వారమైన ముక్కులో వైరస్ నుంచి రక్షణ, వ్యాప్తి నిరోధకం, వైరస్ సోకకుండా ఉండేలా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. మూడు గ్రూపుల వారీగా ఈ ట్రయల్స్ జరుగుతున్నాయని వివరించారు.
మొదటి గ్రూపు వారికి తొలిడోసుగా కొవాగ్జిన్ ఇచ్చి, రెండో డోసుగా ముక్కు ద్వారా తీసుకునే డోసు ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా రెండో గ్రూపులో తొలి, రెండో డోసును ముక్కు వ్వారా అందిస్తున్నామని, మూడో గ్రూపులో ముక్కు ద్వారా తొలిడోసు, కొవాగ్జిన్‌ను రెండో డోసుగా ఇచ్చి పరీక్షిస్తున్నామని చెప్పారు.  ఈ ప్రయోగాలను 650 వాలంటీర్లపై జరుపుతున్నామని, 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తూ పరీక్షిస్తున్నామని కృష్ణ ఎల్లా వెల్లడించారు.

వ‌చ్చే నెల‌లో భార‌త్‌కు జాన్స‌న్ వ్యాక్సిన్‌!

కొవిడ్‌-19 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత ముమ్మ‌రం చేసే దిశ‌గా భారీ ముందడుగు ప‌డింది. డిసెంబ‌ర్ నాటికి దేశ‌వ్యాప్తంగా అర్హులైన జ‌నాభా అంత‌టికీ క‌నీసం క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాల‌నే ల‌క్ష్యం నెర‌వేరేందుకు ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియను వేగవంతం చేసింది. 

ఇక అక్టోబ‌ర్ నుంచి భార‌త్‌కు జాన్స‌న్ అండ్ జాన్స‌న్ వ్యాక్సిన్ తొలి డోసుల స‌ర‌ఫ‌రా ప్రారంభం కానుంది. తొలివిడ‌త‌లో 4.35 కోట్ల జాన్స‌న్ సింగిల్ డోస్ టీకాల‌తో కూడిన షిప్‌మెంట్ దేశానికి చేరుకోనుందని స‌మాచారం. అక్టోబ‌ర్‌లో 30 కోట్ల టీకా డోసుల పంపిణీ చేప‌ట్టాల‌న్న ల‌క్ష్యం చేరుకునేందుకు జాన్స‌న్ టీకాల రాక ప్ర‌భుత్వానికి ఉప‌క‌రించ‌నుంది.

ఇక దేశీయంగా వ్యాక్సిన్ల కొర‌త తీరడంతో వ్యాక్సిన్ మైత్రి కార్య‌క్ర‌మం కింద అక్టోబ‌ర్ నుంచి టీకాల ఎగుమ‌తిపైనా ప్ర‌భుత్వం దృష్టిసారిస్తుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ ఇటీవ‌ల పేర్కొన్నారు.