చేనేత, వృత్తి కళాకారుల కోసం జీఈఎం పోర్టల్‌

చేనేత కార్మికులు, చేతివృత్తిదారులకు మెరుగైన మార్కెట్ సదుపాయాన్ని అందించడానికి గవర్న్‌మెంట్‌ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎమ్) పోర్టల్‌ విశేషంగా సహాయపడనున్నది. ఆన్‌బోర్డ్ వీవర్స్, చేతివృత్తుల వారికి వారి వారి ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వ విభాగాలకు విక్రయించడానికి వీలుగా ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. 

చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు, మహిళలు, గిరిజన పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలకు సేవలను పొందాలనుకునే వారితో భాగస్వామ్యాన్ని పెంచుతున్నది.

ప్రభుత్వ డాటా ప్రకారం, గత నెల 30 వరకు 28,374 మంది చేతివృత్తులవారు, 1,49,422 మంది చేనేత కార్మికులు పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జీఈఎమ్‌లో ఆర్టిజన్స్‌, వీవర్స్‌, విక్రేతల రిజిస్ట్రేషన్, ఆన్‌బోర్డింగ్‌ను చేనేత డెవలప్‌మెంట్ కమిషనర్ కార్యాలయం గత ఏడాది జూలైలో ప్రారంభించింది. 

56 హస్తకళల సేవా కేంద్రాలు, 28 వీవర్ సేవా కేంద్రాల నుంచి అధికారులు శిక్షణ పొంది విక్రేతల నమోదు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. చేనేత ఉత్పత్తుల కోసం 28 ప్రత్యేకమైన ఉత్పత్తి క్యాటగిరీలు సృష్టించినట్లు ప్రభుత్వం తెలిపింది. హస్తకళల ఉత్పత్తుల కోసం ఏకకాలంలో 170 అనుకూల ఉత్పత్తి వర్గాలు సృష్టించారు.