గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2021లో భారత్ ముందుకు

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ 2021లో భారత్ తన ర్యాంకులను మెరుగుపరుచుకుంది. తాజాగా ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన  గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ 2021  ర్యాంకింగ్స్‌లో భారత్ 36.4 స్కోరుతో 46వ స్థానంలో ఉంది. గత ఏడాది 2020తో పోలిస్తే భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది.
 
అగ్రస్థానంలో 65.5 స్కోరుతో స్విట్జర్లాండ్ ఉండగా, స్వీడన్ 63.1 రెండవ, అమెరికా (61.3) మూడవ, బ్రిటన్ (59.8) నాల్గవ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా (59.3) ఐదవ స్థానంలో ఉన్నాయి. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ)లో తన స్థానాన్ని వేగంగా మెరుగుపరుచుకుంది. 2015లో 81 ర్యాంక్ నుంచి 2021లో 46కు చేరుకుంది.
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో కూడా సృజనాత్మకత విషయంలో భారత్ ముందంజలో ఉంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ప్రస్తుతం దేశంలో కీలకంగా మారింది.
ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధన సంస్థలు చేస్తున్న పనులు, అణుశక్తి శాఖ వంటి శాస్త్రీయ విభాగాలు; డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన విభిన్న రంగాలలోని విధానాలలో ఆవిష్కరణలను తీసుకొని రావడం కోసం నీతి ఆయోగ్ కృషి చేస్తోంది. ఈ ర్యాంకింగ్స్‌లో అంగోలా దేశం చివరి స్థానం(130)లో ఉంది.