అక్టోబ‌ర్ 12 నుంచి 2022-23 బ‌డ్జెట్ క‌స‌ర‌త్తు

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2022-23) బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల త‌యారీ క‌స‌ర‌త్తు అక్టోబ‌ర్ 12 నుంచి ప్రారంభం కానున్న‌ది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ సోమ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇది మోదీ 2.0 ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స‌మ‌ర్పించ‌నున్న నాలుగో వార్షిక బ‌డ్జెట్ కానున్న‌ది.

 2022 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పిస్తారు. గ‌త కొన్నేండ్లుగా ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీనే కేంద్ర బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.

క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న అంచ‌నాల మ‌ధ్య ద్ర‌వ్య క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తూ, ఆర్థిక వృద్ధిరేటు వేగ‌వంతం చేయ‌డంపైనే బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో విత్త‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఫోక‌స్ చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 12 నుంచి 2022-23 బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప్రీ-బ‌డ్జెట్ చ‌ర్చ‌లు ప్రారంభం అవుతాయ‌ని ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం ఓ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

వివిధ శాఖ‌లు వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌మ ప్ర‌ణాళిక‌లు, బ‌డ్జెట్ కేటాయింపుల‌పై వేర్వేరుగా ఆర్థిక‌శాఖ‌కు నివేదిక‌లు స‌మ‌ర్పిస్తాయి. వివిధ రంగాల పారిశ్రామిక ప్ర‌ముఖులు, పారిశ్రామిక సంఘాల నేత‌ల‌తోనూ ఆర్థిక మంత్రి స‌మావేశ‌మ‌వుతారు.