ఎంఐఎంకు భయపడే గన్ లైసెన్స్ ఇవ్వడం లేదు 

ఎంఐఎంకు భయపడే డీజీపీ తనకు గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని బిజెపి ఎమ్యెల్యే రాజా సింగ్ ఆరోపించారు. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా కూడా డీజీపీ తనకు లైసెన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు.

తనకు పలు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తామని, బాంబ్ పెడతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌‌కు సంబంధించి నంబర్లతో సహా పూర్తి వివరాలను తీసుకుని వెళ్లి డీజీపీకి  ఫిర్యాదు చేశానని తెలిపారు. 

నేరస్థులను పట్టుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతోపాటు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటారని గుర్తు చేస్తూ మరి తనకు ఏం చేస్తారో చూడాలని పేర్కొన్నారు. గతంలో కూడా పాకిస్తాన్, దుబాయ్ నుంచి  ఇదే మాదిరిగా బెదిరింపు కాల్స్ వస్తే డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.

అప్పుడు కూడా తన ఫిర్యాదులపై ఎవరూ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు గన్ లైసెన్స్ ఇస్తారా? లేదా? తేల్చాలని డిమాండ్ చేశారు.  తాను ఒక ఎమ్మెల్యే ను. బీజేపీ ఫ్లోర్ లీడర్‌‌ను అయినా తనకు డీజీపీ గన్ లైసెన్స్ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.

తనపై కేసులు ఉన్నాయని, కేసులు ఉంటే  గన్ లైసెన్స్ ఇవ్వలేమని చెప్పారని పేర్కొంటూ మరి దేశ ద్రోహి అక్బరుద్దీన్ మీద పలు కేసులు ఉన్నా ఆయనకు గన్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినట్లు? అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.  ఇంకా రాష్ట్రంలో చాలా మందిపై కేసులు ఉన్నప్పటికీ డీజీపీ గన్ లైసెన్స్ ఇచ్చారని తెలిపారు.